KCR : నేను కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో కాంగ్రెస్ కు తెలుసు.. కేసీఆర్ హాట్ కామెంట్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలారోజుల తర్వాత గర్జించారు. 'నేను కొడితే మామూలుగా ఉండదు. ఆ దెబ్బ ఎలా ఉంటుందో కాంగ్రెస్కు తెలుసు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని కాంగ్రెస్ పాలనపై దండయాత్ర చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలతో ఎర్రవల్లి ఫామ్హహౌస్లో కేసీఆర్ భేటీ అయ్యారు. కైలాసం ఆట ఆడితే పెద్దపాము మింగినట్లుగా తెలంగాణ ప్రజల పరిస్థితి ఉందని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో తాను చెప్పినా వినకుండా ప్రజలు అత్యాశకు పోయి కాగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మోసపోయారన్నారు.
తెలంగాణలో ఓ ఒక్క పథకం సరిగ్గా అమలు కావడం లేదని, ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే పడకేశాయని మళ్లీ కరెంట్ కోతలు, మంచి నీళ్లకు కరువు వచ్చిందన్నారు కేసీఆర్. ప్రజలు ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని, ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంటోందని పేర్కొన్నారు. ఇక లాభం లేదని, ప్రత్యక్ష పోరాటమే శరణ్యమని అన్నారు. ఇన్ని రోజులుగా తాను మౌనంగా ఉన్నానని, గంభీరంగా అన్నీ గమనిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే అబద్ధాల పంచాగం అని, ఇంకెవరూ కొట్లాడరు.. ఎవరితోనూ కాదని, తెలంగాణ హక్కుల గురించి మళ్లీ మనమే కొట్లాడాలని, ప్రాణం పోయినా తెలంగాణకు రక్షకులం మనమేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com