వరద బాధితులకు రూ. 50 వేలు ఇస్తాం : కాంగ్రెస్

మేనిఫెస్టోలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ కంటే ఒక అడుగు ముందుకేసింది కాంగ్రెస్. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలకు తాయిలాలు ప్రకటించింది. మేనిఫెస్టోను కాంగ్రెస్ నేతలతో కలిసి విడుదల చేశారు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్. ప్రస్తుతం వరద బాధితులైన ప్రతి ఒక్కరికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పది వేల రూపాయలు అందజేస్తోంది. దాన్ని 50 వేలకు పెంచుతామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. అంతే కాదు పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు 5 లక్షల రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 2లక్షల 50వేల రూపాయల చొప్పున సాయం అందిస్తామని వెల్లడించింది.
హైదరాబాద్ మెట్రోను పాతబస్తీ నుంచి ఎయిర్‌పోర్టు వరకూ పొడిగిస్తామని.. ఎంఎంటీఎస్, మెట్రోల్లో దివ్యాంగులు, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఇక అర్హులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వడంతో పాటు 80 గజాలలోపు ఉన్న భూముల్లో ఇల్లు కట్టుకున్నవారికి ఆస్తి పన్ను రద్దు చేస్తామని పేర్కొంది. ప్రజలకు గుదిబండగా మారిన ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ లేకుండా చేస్తామంది. టీఆర్‌ఎస్ గెలిస్తే.. 20 వేల లీటర్ల వరకు ఉచితంగా తాగు నీరు అందిస్తామని హామీ ఇవ్వగా.. కాంగ్రెస్ మాత్రం 30 వేల లీటర్ల మంచి నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని తన ఎన్నికల ప్రణాళికలో స్పష్టం చేసింది
ఇక భవిష్యత్తులో జరిగే పట్టణీకరణను కూడా దృష్టిలో ఉంచుకుని... హెచ్ఎండీఏ పరిధిలో సమగ్ర డ్రైనేజీ వ్యవస్థను రూపొందించి అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కోవిడ్-19 చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేరుస్తామని చెప్పిన కాంగ్రెస్.. బస్తీ దవాఖానాల సంఖ్యను 450కి పెంచుతామని తెలిపింది. దీంతో పాటు 100 యూనిట్ల లోపు గృహాలకు కరెంట్ ఉచితంగా ఇస్తామని చెప్పింది.
టీఆర్‌ఎస్ మేనిఫెస్టోపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. టీఆర్‌ఎస్ హామీల పట్ల నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరినీళ్లలా మారుస్తామని చెప్పారని.. ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉచిత వైఫై సేవలు ఎక్కడికి పోయాయని నిలదీశారు. గత పదేళ్ల కాలంలో హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ ఘనతే అంటున్న ఆ పార్టీ నేతలు... జీహెచ్‌ఎంసీలో గెలిస్తే ఖచ్చితంగా మేనిఫెస్టోను అమలు చేస్తామని చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com