CONGRESS: ధనవంతులకే మోడీ, కేసీఆర్ దన్ను

ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ధనవంతులకే కొమ్ముకాస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కుమార్తె కోసం కేసీఆర్, మోడీతో చేయి కలిపారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను చట్టంగా మారుస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. సంపద పోగేసుకోవడం తప్ప కేసీఆర్‌కు ప్రజలపై పట్టింపులేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్ తోనే నెరవేరుతాయని ప్రియాంకగాంధీ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బన్సీలాల్‌పేటలో బహిరంగసభలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీ, బీఆర్‌ఎస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలో కాంగ్రెస్ హయాంలో స్థాపించిన పరిశ్రమలను నరేంద్ర మోడీ సర్కారు అమ్ముకుంటోందన్నారు.
సీఎం కేసీఆర్, మోదీ పేదలను మరింత పేదలుగా చేస్తున్నారని ధనవంతులకే కొమ్ముకాస్తున్నారని ఖర్గే ఆరోపించారు. తెలంగాణలో ల్యాండ్, సాండ్, వైన్స్ మాఫియా పెరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. బోధన్,ఆదిలాబాద్, వేములవాడ బహిరంగసభల్లో పాల్గొన్న రాహుల్ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను చట్టంగా మారుస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లుగా కీలకమైన మంత్రిత్వ శాఖలు. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల చేతుల్లోనే పెట్టుకుని భారీగా దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.
దళితబంధు పథకంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రూ. 3 లక్షలు తీసుకున్నారని... ఎస్‌సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లించారని రాహుల్ ఆరోపించారు. రూ. 5,500 కోట్లు ఎస్‌టీ సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించారని ఆరోపించిన కాంగ్రెస్ యువ నేత... రూ. 15, 500కోట్ల ఎస్‌సీ సబ్‌ప్లాన్ నిధులను మళ్లించారన్నారు. గత పదేళ్లుగా దొరల, కుటుంబ ప్రభుత్వాన్ని చూశారని... రాబోయే పదేళ్లలో ప్రజల ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందో చూపెడతామని అన్నారు.
తెలంగాణలో రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్న ప్రియాంకగాంధీ ఖమ్మం, పాలేరు, సత్తుపల్లిలో రోడ్‌షోలో పాల్గొన్నారు. ఏ లక్ష్యంతో అయితే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ లక్ష్యం నెరవేరలేదన్నారు. భారాస పాలనలో అన్నివర్గాలు తీవ్రంగా నష్టపోయాయని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు బాధలో ఉన్నారని. తెలంగాణలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను, స్వప్నాలను నెరవేర్చలేదని ప్రియాంక మండిపడ్డారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వం వాళ్ల కుటుంబ ప్రయోజనాలు, ధనవంతుల ప్రయోజనాల కోసమే పనిచేస్తోంది కానీ...... పేదలు, రైతులు, యువత కోసం పనిచేయడం లేదని మండిపడ్డారు. రైతుబంధుతో పాటు దళితబంధు, బీసీబంధు పథకాలకు సీఎం కేసీఆర్ ఎందుకు అనుమతి తేలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. జుక్కల్,షాద్‌నగర్,ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి సభల్లో పాల్గొన్న రేవంత్.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపించడం ఖాయమని వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com