Revanth Reddy : లోకల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం అదే..

తెలంగాణలో రాబోయే లోకల్ బాడీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో వచ్చిన ఫలితంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఫలితం తమ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టంగా చూపించిందని రేవంత్ అంచనా. అందుకే ఆలస్యం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడమే ప్రధాన అజెండాగా డిసైడ్ అయ్యారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా తీసుకొస్తున్న అంశం బీసీ రిజర్వేషన్లే. పార్టీ అధిష్ఠానం ఇప్పటికే 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు పార్టీ పరంగా కేటాయించేందుకు సన్నాహాలు మొదలు పెట్టేసింది.
ఇది కేవలం నిర్ణయమే కాదు, ప్రతిపక్షాలపై ఒత్తిడి తీసుకొచ్చే రాజకీయ యుద్ధతంత్రం కూడా. బీజేపీ, బీఆర్‌ఎస్ కూడా తమవంతు బాధ్యతగా బీసీలకు అదే రకమైన రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ ఓపెన్ ఛాలెంజ్ విసరాలని చూస్తోంది. ఒకవేళ ప్రతిపక్షాలు వెనక్కి తగ్గితే… దాన్ని భారీగా ప్రచారం చేసి ఆ కోణంలో ఓట్లు సాధించాలనే వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ విజయంతో పాటు ఇప్పటికే అమలు చేసిన పలు పథకాలను ఈ ఎన్నికల్లో ప్రధాన ఆయుధాలుగా మార్చాలని కాంగ్రెస్ తలపోస్తోంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రెండు లక్షల రుణమాఫీ అంశాలు పెద్ద ఎత్తున ప్రచారంలో వాడబోతున్నారు. ముఖ్యంగా మహిళలు, రైతులు, బీసీ ఓటర్లపై ఈ ప్రచారాలు ప్రభావం చూపుతాయని పార్టీ అంచనా. ఈ మొత్తం వ్యూహంతో కాంగ్రెస్ ఒక వైపు ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టాలని, మరో వైపు సంక్షేమ పథకాలను చూపించి జూబ్లీహిల్స్ గెలుపుతో వచ్చిన వేగాన్ని లోకల్ బాడీ ఎన్నికల్లో సీట్ల రూపంలో మార్చుకోవడమే అసలైన ప్లాన్ అని తెలుస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

