TG : కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. పానీపట్టు యుద్ధం!

TG : కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. పానీపట్టు యుద్ధం!
X

కరీంనగర్: ఇప్పుుడు రాష్ట్రంలో పానీపట్టు యుద్ధం నడుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ముసురుకున్న నీలినీడలతో... అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నీటి విడుదలకు మొదలైన యుద్ధం... నీటి విడుదల తర్వాత కూడా కొనసాగుతూ తమ ఆధిక్యాన్ని నిరూపించుుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి. అయితే, దీనికి కేంద్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాగా.. అక్కడెలాంటి రాజకీయం నడుస్తుందో ఓసారి పరిశీలిద్దాం.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ నుంచి నీటిని కన్నెపెల్లి లక్ష్మీ పంప్ హౌజ్ కు లిఫ్ట్ చేసి... మిడ్ మానేరుతో పాటు.. లోయర్ మానేరు డ్యామ్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి రిజర్వాయర్స్ అన్నీ నింపాలన్నది ప్రతిపక్ష బీఆర్ఎస్ డిమాండ్. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు.. మాజీల బృందమంతా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డను సందర్శించింది. ఇదే క్రమంలో కన్నెపెల్లి పంప్ హౌజ్ ను.. అంతకుముందు రోజు కరీంనగర్ లోని లోయర్ మానేరు డ్యామును పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే నీటి విడుదలకు డిమాండ్ చేయడంతో పాటు.. కాంగ్రెస్ కు పంచభక్ష పరమాన్నాలను పళ్లెంలో పెట్టిచ్చినా.. సరిగ్గా ఆరగించే స్తోమత కూడా లేకపోయిందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రభుత్వం తాము డిమాండ్ చేస్తున్నట్టుగా ఆగస్ట్ 2లోపు నీటి విడుదల చేయకపోతే.. తమ అధినేత, గులాబీ బాస్ ఆదేశానుసారం 50 వేల మంది రైతాంగంతో తామే వచ్చి లక్ష్మీ పంప్ హౌజ్ లో మోటార్లను ఆన్ చేస్తామని ఓ హెచ్చరిక జారీ చేశారు.

అయితే, బీఆర్ఎస్ బృందం పర్యటనపై నీటిపారుదలశాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించడంతో పాటు.. కేటీఆర్ ను గోబెల్స్ గా పేరు మార్చుకోవాలంటూ చురకలంటించారు. ఇలా ఓవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటల యుద్ధం నడుస్తుండగానే... మరోవైపు ఎగువన గత పది రోజుల నుంచీ కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపెల్లి జిల్లాలోని అంతర్గం మండలంలో నిర్మించిన ఎల్లంపల్లి బ్యారేజ్ కు వరద నీరు పెద్దమొత్తంలో చేరుకుంటోంది. 20 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న ఎల్లంపల్లిలో ఇప్పటికే 18 టీఎంసీలకు నిల్వ సమీపిస్తుండటంతో... రెండు రోజుల క్రితం మిడ్ మానేరుకు నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు ఎల్లంపల్లి నుంచి నంది మేడారంలోని నంది పంప్ హౌజ్ కు నీటిని విడుదల చేశారు. అక్కడి నుంచి మొదటు మూడు బాహుబలి మోటార్లతో నీళ్లను ఎత్తిపోసిన అధికారులు క్రమంగా ఎక్కువ మోటార్లతో నీటిని ఎత్తిపోసే ప్రక్రియను పెంచుతున్నారు. ప్రస్తుతం 5 బాహుబలి మోటార్లతో నీటిని ఎత్తి పోస్తుండగా.. అక్కడి నుంచి నీరు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ లో ఉన్న గాయత్రీ పంప్ హౌజ్ కు చేరుకుంటోంది. గాయత్రీ పంప్ హౌజ్ వద్ద కూడా బాహుబలి మోటార్ల ద్వారా నీటిని మిడ్ మానేరు నింపడానికి ఎత్తిపోసే ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో మొన్నటివరకూ 5 టీఎంసీలకే పరిమితమైన 27 టీఎంసీల కు పైగా నిల్వ సామర్థ్యమున్న మిడ్ మానేరులో ఇప్పుడు నీటి నిల్వలు 8 టీఎంసీలకు చేరుకున్నాయి.

Tags

Next Story