TG : వివాదాస్పదంగా బల్మూరి వెంకట్ నామినేషన్

యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోటీ చేయడం వివాదంగా మారింది. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న ఆయన మళ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఠాకూర్ బహిరంగంగానే వెంకట్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు.
ఇప్పటికే ఎమ్మెల్సీగా పార్టీ అవకాశం ఇచ్చి నందుకు అధ్యక్ష పదవికి పోటీ చేయడం విరమించుకోవాలని కోరడం పార్టీలో కలకలం సృష్టించింది. రామగుండంలో జరిగిన యువజన కాంగ్రెస్ సమావేశంలో రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పు కోవాలని, వేరే వారికి అవకాశం ఇవ్వాలని బల్మూరి వెంకట్ కు విజ్ఞప్తి చేశారు. ఠాకూర్ వ్యాఖ్యలపై వెంకట్ నుంచి ఇంకా ఎలాంటి ప్రతి స్పందన రాలేదు. ఆయన తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వెంకట్ కు వ్యతిరేకంగా ఠాకూర్ తో పాటు పార్టీ ముఖ్య నేతలు కొందరు, ఒకరిద్దరు మంత్రులు కూడా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
అయితే, వారు బాహాటంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అక్టోబర్ 5 వరకు యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవితో పాటు ఇతర కార్యవర్గం ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుత అధ్యక్ష పదవికి 19 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 10 మంది నామినేషన్లు ఆమోదించారు. మిగతా నామినేషన్లు తిరస్కరించారు. పోటీ ప్రధానంగా బల్మూరి వెంకట్, శివచరణ్ రెడ్డి మధ్య ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com