తెలంగాణలో చాపకింద నీరులా విస్తరిస్తోన్న కరోనా వైరస్

తెలంగాణలో చాపకింద నీరులా విస్తరిస్తోన్న కరోనా వైరస్
చాలా మంది మాస్కులు, శానిటైర్లు లేకుండానే రోడ్లమీదకు వస్తున్నారు. దీనికారణంగా వైరస్ వ్యాప్తి పెరిగిందని వైద్యులు అంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇక వైరస్ బాధ పోయిందిలే అనుకున్న సమయంలో ఎక్కువ కేసులు నమోదు కావడంతో అటు అధికారుల.. ఇటు జనం ఆందోళన చెందుతున్నారు. దీంతో మరోసారి కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తారేమోనని జనం బుగులు పడుతున్నారు. కఠిన ఆంక్షలు ఏమి లేకపోవడంతో జనం యధావిధిగా తిరుగుతున్నారు. చాలా మంది మాస్కులు, శానిటైర్లు లేకుండానే రోడ్లమీదకు వస్తున్నారు. దీనికారణంగా వైరస్ వ్యాప్తి పెరిగిందని వైద్యులు అంటున్నారు.

ఇక నిర్మల్ జిల్లా ముథోల్‌లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ముథోల్, భైంసాలో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. భైంసాలోని ప్రభుత్వ పాఠశాలలో 39 మందికి వైరస్ సోకడం కలవరపాటుకు గురిచేస్తోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ముథోల్‌లోని తెలంగాణ గిరిజన బాలికల కళాశాలలో 10 మంది బాలికలు, ఒక ఉపాధ్యాయునికి కరోనా టెస్టులు నిర్వహించారు. వీరిలో 9 మంది బాలికలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మిగతా విద్యార్థినులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్తున్నారు. వైరస్ వ్యాపిస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అటు ఖమ్మం జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. ముదిగొండ మండలం పెదమండవలోని ప్రభుత్వ పాఠశాలలో 10 మంది విద్యార్థులు కోవిడ్ బారిన పడ్డారు. మొత్తం 88 మందికి పరీక్షలు నిర్వహించగా.. వీరిలో పది మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. దీంతో జిల్లా విద్యాశాఖ, గ్రామ పంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక అంబులెన్స్ ద్వారా విద్యార్థులను ఖమ్మం తరలించారు.

తెలంగాణలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో కరోనా లక్షణాలు లేవని 90శాతం మంది బాధితులు వెల్లడించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఈ తరహా బాధితులు సుమారు 70 శాతం మంది ఉండగా.. తాజాగా 90 శాతానికి పెరగడంపై ఆరోగ్య శాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అయితే దీని వల్ల నష్టం జరిగే ప్రమాదమూ పొంచి ఉందని కూడా హెచ్చరిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story