Corona Cases in Telangana: కొత్త వేవ్‌ల భయం అక్కర్లేదు: వైద్యశాఖ

Corona Cases in Telangana: కొత్త వేరియంట్ల ప్రభావంతో గుబులు రేపిన కరోనా థర్డ్ వేవ్ ప్రభావం.. ఇక ముగిసినట్టేనని వైద్యవర్గాలు అంటున్నాయి. తెలంగాణలో జనవరి మూడోవారంలో పతాక స్థాయికి చేరిన కరోనా కేసులు.. ఆ తర్వాతి నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టాయి. థర్డ్ వేవ్ కరోనా కేసులు పతాక స్థాయికి చేరడానికి 17 రోజుల సమయమే పట్టిందన వైద్యులు పేర్కొన్నారు.
వచ్చే వారం, పదిరోజుల్లో రోజువారీ కేసుల సంఖ్య సగటున 200 నుంచి 300కు పడిపోయే అవకాశాలు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒమైక్రాన్ వేరియంట్‌లోని BA-2 ఉపజాతి వల్లే మూడోవేవ్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయని వెల్లడించాయి. థర్డ్‌వేవ్ పట్టణ ప్రాంతాల్లోనే కేసులు ఎక్కువగా నమోదైనట్లు పేర్కొన్నాయి.
మొదట్లో కేసులు భారీగా నమోదై కలవరపరిచినా.. ఇన్ఫెక్షన్ తీవ్రత స్వల్పంగానే ఉండటంతో.. బాధితులు ఇళ్లవద్దే ఐసొలేషన్‌లో ఉంటూ కొవిడ్ చికిత్స తీసుకున్నారు. వైద్యశాఖ లెక్కల ప్రకారం తాజాగా తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం అడ్మిషన్లు 5వేలకు మించటం లేదు. పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్ డిమాండ్ అసలు కనిపించలేదు.
గడిచిన 24 గంటల్లో 68వేల 720 కరోనా టెస్టులు నిర్వహించగా.. కొత్తగా 1380 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మూడోవేవ్‌లో రోజూవారీ కేసుల సంఖ్య తగ్గుతోంది. పది రోజుల తర్వాత రోజూవారీ కేసుల సంఖ్య 1000లోపే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మూడోవేవ్ దాదాపుగా ముగిసినట్టే. కొత్త వేవ్‌ల గురించి ప్రజలు భయపడనవసరం లేదని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
అటు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. తొలిసారి లక్ష దిగువకు చేరుకున్నాయి. గడిచిన 24గంటల్లో 83వేల 876 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.25 శాతం ఉండగా.. రికవరీ రేటు 96.19 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 169 కోట్ల 63లక్షలకుపైగా కరోనా డోసులు పంపిణీ చేసినట్లు తెలిపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com