కరోనా వ్యాక్సిన్ రాగానే ప్రజలకు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లు

యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే అత్యవసర వినియోగం కింద దాదాపు 30దేశాల్లో పలు కంపెనీలకు చెందిన టీకాలు అనుమతులు పొందాయి. ఇక భారత్‌లోనూ అత్యవసర వినియోగం కింద రెండు వ్యాక్సిన్‌లు అనుమతి పొందాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ల తయారీ, అభివృద్ధి కేంద్రంగా ఉన్న భారత్‌వైపు ప్రపంచదేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందులో భాగంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'కొవాగ్జిన్' డోసుల కోసం బ్రెజిల్ సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రకటించింది. ప్రయోగదశలోని టీకా వివరాలు తెలుసుకునేందుకు వివిధ దేశాల దౌత్యవేత్తలు హైదరాబాద్ జీనోమ్ వ్యాలీని ఇటీవలే సందర్శించారు.
భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలోనే అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించింది. బ్రెజిల్‌కు చెందిన ప్రైవేటు సంస్థ బ్రెజిలియన్ అసోసియేషన్ ఆఫ్ వ్యాక్సిన్ క్లినిక్స్ కొవాగ్జిన్ డోసుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం భారత కంపెనీతో ఇప్పటికే ఎంవోయూ కుదుర్చుకున్నట్టు ధ్రువీకరించింది.
కరోనా వ్యాక్సిన్ రాష్ట్రానికి రాగానే... ప్రజలకు ఇచ్చేందుకు.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలిదశలో 80 లక్షల మందికి టీకాలు ఇచ్చేలా ప్రణాళిక సిద్దం చేశారు. ముందుగా కరోనా వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత.. పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు అందిస్తారు. రెండో దశలో 50 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ ఉంటుంది. చివరగా 18 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ముందుగా 5 లక్షల డోసులు, ఆ తర్వాత 10 లక్షల డోసులు.. అనంతరం కోటి డోసులు రాష్ట్రానికి రానున్నాయి. వ్యాక్సిన్ రాష్ట్రానికి వచ్చిన 48 గంటల లోపే.. అందుబాటులో ఉన్న వైద్య సిబ్బందికి ఇస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com