తెలంగాణలో తొలివిడతలో 2.90లక్షల మందికి టీకా

తెలంగాణలో తొలివిడతలో 2.90లక్షల మందికి టీకా
వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన వారం రోజుల్లోనే తొలివిడతను పూర్తి చేస్తామని వైద్య వర్గాలంటున్నాయి.

తెలంగాణలో మొదటగా రెండు లక్షల 90 వేల మందికి టీకా అందించనున్నారు. 800కుపైగా కేంద్రాల్లో కరోనా టీకా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

సోమ, మంగళవారాల్లో రాష్ట్రానికి 6.50 లక్షల వ్యాక్సిన్‌ డోసులు వచ్చే అవకాశం ఉందని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. తొలుత హైదరాబాద్‌లోని కోఠి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయం వద్దనున్న కోల్డ్‌ స్టోరేజీకి డోసులు చేరుకోనున్నాయి. అనంతరం అక్కడి నుంచి జిల్లాలకు వాటిని రవాణా చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 5 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసుల నిల్వకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లో 3 కోట్లు, జిల్లాల్లో 2 కోట్ల డోసులను నిల్వ చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. వైద్య సిబ్బందికి ఇచ్చే రెండు విడతల డోసులను ఒకేసారి కేంద్రం పంపనుంది.

తొలి రోజు రాష్ట్రవ్యాప్తంగా 13,900 మందికి కొవిడ్‌ టీకా అందుతుంది. మొదటి రోజున ప్రతి జిల్లాలో సగటున రెండు, మూడు టీకా కేంద్రాల్లో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో అత్యధిక కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ జరుగుతుంది. ఇదే రోజున 45 ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ టీకాల కార్యక్రమం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఈనెల18 నుంచి కరోనా టీకా కేంద్రాలను 1200కు పెంచుతామని అధికారులు వెల్లడించారు. జనవరి 22లోగా వైద్య సిబ్బందికి టీకాలివ్వడం పూర్తి చేస్తామన్నారు. వైద్య సిబ్బందికి టీకాలు వేయడం పూర్తయిన వెంటనే ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన వారం రోజుల్లోనే తొలివిడతను పూర్తి చేస్తామని వైద్య వర్గాలంటున్నాయి. వారంలోనూ నాలుగు రోజులు మాత్రమే టీకాలివ్వనున్నారు. సోమ, మంగళ, గురు, శుక్ర వారాల్లో కరోనా టీకాలిస్తారు. టీకా తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు ఇవ్వాల్సి ఉన్నందున వైద్య సిబ్బందికి ఫిబ్రవరి 16 నుంచి రెండో డోసును ఇస్తామని అధికారులు చెబుతున్నారు. మార్చి మూడో వారం నాటికి రాష్ట్రంలో వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు రెండు విడతల డోసు ఇవ్వడం పూర్తి అవుతుందని అంటున్నారు.


Tags

Read MoreRead Less
Next Story