TG : మాజిద్, ఫిరోజ్ ఖాన్ లకు సీపీ వార్నింగ్

హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ , కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మధ్య జరిగిన గొడవ పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విచారణ జరిపారు. హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్ హోదాలో ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ తో పాటు ఫిరోజ్ ఖాన్ వాదనలు విన్నారు. ఇరు పక్షాలు సీపీ ముందు తమ వాదనలు వినిపించాయి. అక్టోబర్ 1న హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిరోజ్ గాంధీ నగర్‌లో CC రోడ్డు పనులను ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ పరిశీలిస్తుండగా.. అక్కడికి వెళ్లారు ఫిరోజ్ ఖాన్. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తలు గొడవ పడ్డారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరుపక్షాల కార్యకర్తలను చెదరగొట్టారు. ఇరుపక్షాలపై కేసులు నమోదు చేశారు.
కేసు విచారణ సందర్భంగా రెండు వర్గాల మధ్య రాజకీయ వైరం ఉందని హుమాయూన్ నగర్ ఎస్‌హెచ్‌ఓ మెజిస్ట్రేట్ కు తెలిపారు.ఇరువర్గాల గొడవలతో స్థానికంగా ఉద్రికత్తలు నెలకొంటున్నాయని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీపీ సీవీ ఆనంద్.. రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ తో పాటు ఫిరోజ్ ఖాన్ కు సూచించారు. పోలీస్ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తదుపరి విచారణకు వాయిదా వేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com