TG : అబద్ధాలు, మోసం.. కాంగ్రెస్ డీఎన్ఏలోనే లేదు : దామోదర రాజనర్సింహ

ప్రతి వారం ఇద్దరు మంత్రులు గాంధీ భవన్ కు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ తీసుకున్న నిర్ణయం గొప్ప ఆలోచన అని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన కార్యకర్తలతో మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో దామోదర రాజనర్సింహ హాజరయ్యారు.ఈ సందర్భంగా భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తమ దరఖాస్తులు ఇచ్చేందుకు గాంధీ భవన్ కు తరలి వచ్చారు. వారి నుంచి మంత్రి అప్లికేషన్లు స్వీకరించారు. అనంతరం మాట్లాడిన దామోదర.. అబద్ధాలు, మోసం కాంగ్రెస్ డీఎన్ఏలో లేదని చెప్పారు. కార్యకర్తలకు పార్టీ నాయకత్వం దగ్గర అవ్వడానికి మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం మంచి అవకాశం అన్నారు. పార్టీ గెలుపునకు కష్టపడి పని చేసిన కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. పీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. గాంధీ భవన్ లో కార్యకర్తలతో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని ప్రజలు, కార్యకర్తలు తొందరపడవద్దని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇక్కడ వచ్చే దర్యాప్తులను వీలైనంత తొందరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com