గ్రేటర్ ఎన్నికల్లో సీటు రాకపోవడంతో నాయకురాలు ఆత్మహత్యాయత్నం

టీఆర్‌ఎస్ తరపున గ్రేటర్ ఎన్నికల బరిలో నిలవాలనుకుని.. ఆశాభంగం కలిగిన నేతలు తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలో సిట్టింగ్ కార్పొరేటర్లకు మళ్ళీ టిక్కెట్లు ఇవ్వడంపై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అనుచరుడు నల్ల రఘుమారెడ్డికి పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వకుండా.. చంపాపేట డివిజన్ సిట్టింగ్ కార్పొరేటర్ సామా రమణారెడ్డికి ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. చంపాపేట డివిజన్ టీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జి గాదరి కిశోర్, స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో సుధీర్‌రెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయి.. పరస్పరం దూషించుకున్నారు. సుధీర్‌రెడ్డి ఎంత వారించినా కార్యకర్తలు వినకపోవడంతో సమావేశం మధ్యలో నుంచి సుధీర్‌రెడ్డి వెళ్లిపోయారు.
గ్రేటర్ ఎన్నికల్లో.. టికెట్ దక్కకపోవడంతో ఆందోళనకు దిగుతున్నారు టీఆర్‌ఎస్ నేతలు. తాజాగా శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్‌లో విభేదాలు భగ్గుమన్నాయి. మాదాపూర్ డివిజన్ టికెట్ ఆశించి భంగపడ్డ డివిజన్ ప్రెసిడెంట్ ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్... ఒకే కుటుంబంలో భార్యభర్తలకు టికెట్ ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో కలిసి మాదాపూర్‌లో ఆందోళనకు దిగారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు మాదాపూర్ టీఆర్‌ఎస్ కార్యకర్తలు.
మరోవైపు.. గ్రేటర్ ఎన్నికల్లో సీటు రాకపోడవంతో ఆత్మహత్యాయత్నం చేశారు నాచారం బీజేపీ నాయకురాలు విజయలతారెడ్డి. నాచారం బీజేపీ టికెట్ ఆశించిన విజయలతా రెడ్డి.. ఆ సీటును ఇతరులకు కేటాయించడంతో.. తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. మనోవేదనతో... ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్.. తమకు టికెట్ రాకుండా చేశారని ఆరోపిస్తున్నారు. గత గ్రేటర్ ఎన్నికల్లో విజయలతా రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు కూడా ఇదే స్థానంలో పోటీ చేయాలని భావించారు. కానీ టికెట్ రాకపోవడంతో.. ఆత్మహత్యాయత్నం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com