TG : వణుకుతున్న భద్రాద్రి జిల్లా.. మణుగూరులో 31సెం.మీ. వర్షపాతం

భద్రాద్రి జిల్లాలోని మణుగూరును వరద ముంచెత్తింది. మూడు దశాబ్దాల తర్వాత ఇంత భారీ వరద రావడంతో ప్రజలు ఆందోళనలకు గురయ్యారు. ప్రజలను పోలీసులు పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కలెక్టర్ జితేశ్వి పాటిల్, ఎస్పీ బి. రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహూల్ మణుగూరుతో పాటు పలు వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. వరదలతో జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. మణుగూరులో 31.6 సెంటిమీటర్లు, బూర్గంపహడ్‌లో 28.7, భద్రాచలంలో 25.5, పాల్వంచలో 23.7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
కూసుమంచి మండలంలో పాలేరు నుంచి నర్సింహులగూడెం వెళ్లే రోడ్డుకు గండిపడింది. తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ నుంచి కొక్కిరేణి పోయే రహదారికి బ్రిడ్జి దగ్గర గండిపడింది. కూసుమంచి మండలం నాయకన్ గూడెం దగ్గర ఇటుక బట్టీల్లో కూలీలుగా పనిచేస్తున్న నలుగురు గల్లంతు కాగా, ఒకరిని స్థానికులు కాపాడారు. పాలేరు అలుగు నీరు ఒక్కసారిగా రావడంతో మిగిలిన ముగ్గురు గల్లంతయ్యారు. కల్లూరులోని ఇటుక రాళ్ల చెరువుకు గండిపడింది. వరద నీరు గండి ద్వారా ఉధృతంగా ప్రవహిస్తూ పంట పొలాలపై నుంచి వెళ్లడంతో వరి పైరు కోతకు గురై కొట్టుకుపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com