TG : ధరణి పొర్టల్ రద్దు.. త్వరలోనే ఆర్ఓఆర్ చట్టం : మంత్రి పొంగులేటి

ధరణి పొర్టల్‌ను రద్దు చేసి త్వరలో ఆర్ఓఆర్ చట్టం తీసుకువస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ నెలాఖరులోగా అమల్లోకి తెస్తామని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించామని, ప్రజల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్స్ ను గాలికి వదిలేసిందని, పూర్తైన ఇండ్లను దసరా లోపు పేద ప్రజలకు అందజేస్తామని ఆయన వెల్లడించారు. ఈనెల 7వ తేదీన ప్రజా ప్రభుత్వం ఏర్పాడి 10 నెలలు పూర్తి అవుతుందని, 10 నెలల్లో ప్రజలు కోరుకున్న వాటిని సాధించలేక పోయామని, రాబోయే రోజుల్లో తెల్ల రేషన్ కార్డు సహా అన్ని పథకాలకు స్మార్ట్ కార్డుతో అనుసంధానం చేస్తామన్నారు. ఈ దసరా లోపు స్మార్ట్ కార్డులు ఇస్తామని, అర్హతలను బట్టి స్మార్ట్ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్మారు. రాబోయే నాలుగేళ్లలో ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన ప్రతి పేదలకు ఇళ్లు ఇస్తామన్నారు. జనవరి నుంచి ఆసరా పెన్షన్లు, సన్న బియ్యం పంపిణీ చేస్తామని, రుణ మాఫీ కానీ రైతులకు 13 వేల కోట్ల రూపాయలతో త్వరలో విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాలు సొల్లు మాటలు మాట్లాడుతున్నారని, 10 ఏళ్లలో బీఆర్ఎస్ రైతులకు ఇచ్చింది రూ. 15 వేల కోట్లు మాత్రమేనని, ప్రతిపక్ష పార్టీలు పోరంబోకు మాటలు మాట్లాడుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com