Save Life of Son : ఉస్మానియాలో తల్లి కాలేయాన్ని కుమారునికి అమర్చిన వైద్యులు

రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతున్నాయి. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఇప్పటికే ఎనిమిదిమంది చిన్నారులతో పాటు 30 మందికి కాలేయ మార్పిడి చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా మరో చిన్నారికి కాలేయ మార్పిడి చికిత్స విజయవంతమైంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్, అమల దంపతుల కుమారుడు మాస్టర్ చోహన్ ఆదిత్య (3 సంవత్సరాలు) పుట్టుకతోనే పిత్తాశయ ధమని, కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. చోహన్ ఆదిత్యను పరిశీలించిన ఉస్మానియా వైద్యులు మధుసూదన్ నేతృత్వంలోని సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, కాలేయ మార్పిడి బృందం ఈ నెల మూడో తేదీన ఆదిత్యకు ఉస్మానియా ఆసుపత్రిలో కాలేయ మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. చోహన్ ఆదిత్య మాతృమూర్తి అమల కాలేయాన్ని తన కుమారునికి దానం చేయడంతో కొంత భాగాన్ని తీసుకొని బాలునికి అమర్చారు. ప్రస్తుతం తల్లీకుమారుడు క్షేమంగా ఉన్నారు. వారిని మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com