వాళ్లకు పరాయి లీడర్లు, కిరాయి మనుషులే గతి : హరీష్ రావు

వాళ్లకు పరాయి లీడర్లు, కిరాయి మనుషులే గతి : హరీష్ రావు

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం హోరెత్తుతోంది. మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కేంద్రం రైతు వ్యతిరేక బిల్లులు తెస్తోందని... వాటికి వ్యతిరేకంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ ఉద్యమం చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ వాళ్లకు పరాయి లీడర్లు, కిరాయి మనుషులే గతి అని ఆయన దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పక్క జిల్లాల నుంచి మనుషులను తెచ్చుకుంటోందని ఆయన అన్నారు. అబద్దాల పునాదుల మీద బీజేపీ, కాంగ్రెస్‌లు ఓట్లు పొందాలని చూస్తున్నాయని హరీష్ రావు ఆరోపించారు.

దుబ్బాకలో తమకు మంచి మెజారిటీ రాబోతోందని TRS వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి KTR జోస్యం చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు డిపాజిట్లు కూడా రావన్నారు. బీజేపీ సమాజంలో తక్కువ, సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ ఉంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రతీ స్కీమ్‌ వాళ్లదేనని బీజేపీ చెప్పుకుంటోందని, ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెప్తారని అన్నారు. ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఉరుకోనేది లేదని హెచ్చరించారు. దుబ్బాక బైపోల్‌తోపాటు తాజా రాజకీయ పరిణామాలపై మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన KTR.. రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తోందని అన్నారు. 60 లక్షల కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందిస్తోందని గుర్తు చేశారు. చిన్న, సన్నకారు రైతులకు KCR నిర్ణయాలతో ఎంతో మేలు జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కేవలం విమర్శల కోసమే ఉన్నాయని, ఇకనైనా వారు తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ చూసి భయపడి మంత్రి హరీష్ రావు, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నాటకాలాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హరీష్ రావు, రఘునందన్ రావులు ఇద్దరూ అన్నదమ్ములని... కావాలనే ఉప ఎన్నికల్లో ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు. దుబ్బాక మండలం శివాజీనగర్, గంభీర్ పూర్, పోతారం, ఆరెపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. తమ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో బీజేపీ అభ్యర్ధి రఘునందనరావుకు మద్దతుగా లాయర్లు ర్యాలీ చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు,మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ధర్మం,న్యాయం,హక్కుల కోసం పోరాటం చేస్తోన్న రఘునందనరావుకు ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించాలని కోరారు. దుబ్బాక ఉప ఎన్నిక ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతోన్నపోటీ అని అన్నారు.

వరుస ఉద్రిక్తతల నేపథ్యంలో దుబ్బాకలో కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలు కవాతు చేశాయి. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని భరోసా నిచ్చాయి. మరోవైపు.. దుబ్బాక బైపోల్‌పై నజర్‌ పెట్టిన ఎన్నికల సంఘం.. ఎన్నికల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేక అధికారిని నియమించింది. తమిళనాడు ఐపీఎస్‌ అధికారి సరోజ్‌ కుమార్‌ను... శాంతిభద్రతల పరిశీలకుడిగా నియమించింది.

Tags

Read MoreRead Less
Next Story