దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం.. చివరి రోజు మరింత వేడెక్కిన రాజకీయ వాతావరణం

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం చివరి రోజు టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు గ్రామగ్రామాన విస్తృత పర్యటనలు నిర్వహించారు. ప్రచారంలో రాజకీయ విమర్శలు సంధించుకున్న పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించి.. ఉపఎన్నికలో లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్ర పన్నిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయం తమకు విశ్వసనీయంగా తెలిసిందని చెప్పారు.
హైదరాబాద్‌లో హింసాత్మక నిరసనకు బీజేపీ కుట్రలు చేస్తోందన్న కేటీఆర్ ఆరోపణలను... బీజేపీ ఎంపీ అర్వింద్ ఖండించారు. తమ కార్యకర్తలను హింసించుకునేందుకు తమకేమైనా పిచ్చా అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్ తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారని అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతోనే ఆయన మైండ్‌సెట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చంటూ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నవంబర్ 3న దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ నెల 10న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 315 పోలింగ్ కేంద్రాల్లో 89 సమస్యాత్మక ప్రాంతాలు, 33 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తింంచారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రానికి 1000 మంది లోపు ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సోషల్ డిస్టన్స్ పాటించేలా మార్కింగ్ చేస్తున్నారు. ఓటర్‌కు మాస్క్, గ్లౌస్ తప్పనిసరి నిబంధన పెట్టారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు మైక్రో అబ్బెర్వర్లను నియమించారు. సీసీ కేమెరాలు, వీడియోగ్రఫీ ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు. 3600 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com