Editorial : గవర్నర్ ప్రసంగం పైనే ఉత్కంఠ !!

Editorial : గవర్నర్ ప్రసంగం పైనే ఉత్కంఠ !!
రేపే తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం; కేంద్రం పై తీవ్ర అసంతృప్తిలో బీఆరెస్ పార్టీ; రాష్ట్రానికి రావాల్సిన నిధుల పై ప్రసంగం చదుపుతారా... తమిళనాడు గవర్నర్ లా వాకౌట్ చేస్తారా ....!

రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా తారాస్థాయికి చేరిన గవర్నర్ వర్సెస్ గవర్నమెంటు పంచాయతీ నెక్స్ట్ ఏ మలుపు తీసుకోబోతుంది అన్న ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొంది. బడ్జెట్ సమావేశాలకు సైతం గవర్నర్ ప్రసంగం లేకుండానే గత సంవత్సరం తీరున ప్రవేశపెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 21న విజ్ఞప్తి చేసినా 31వ తేదీ వరకు గవర్నర్ ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మరింత కాక రాజుకుంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా నా ప్రసంగం ఉంటుందా అని గవర్నర్ కార్యాలయం ప్రభుత్వాన్ని ఆరా తీసినట్టుగా సమాచారం. గవర్నర్ ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తున్నారంటూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. కానీ రాష్ర్ట ప్రభుత్వం కూడా కావాలనే మహిళా గవర్నర్ పై వివక్ష పూరితంగా వ్యవహరిస్తూ, నిబందనలు ఉల్లంగిస్తూ మరీ ఆమెను అవమానిస్తున్నారని గవర్నర్ కార్యాలయ వర్గాలతో పాటు బీజేపీ కూడా ప్రతివాదనలకు సిద్దమైంది. దీంతో కోర్టులో ఇద్దరు ఓ మెట్టు దిగొచ్చారు. అసెంబ్లీలో ప్రసంగించాల్సిందిగా గవర్నర్ను ప్రభుత్వం కోరుతున్నట్టు అందుకు అంగీకరిస్తూ గవర్నర్ ఆమోదం తెలిపినట్టు నిర్ణయాలు వెంట వెంటనే జరిగిపోయాయి.

ఇప్పుడు ఉత్కంఠ అంతా గవర్నర్ అసెంబ్లీలో ఏం ప్రసంగిస్తారు అన్న అంశం చుట్టూ తిరుగుతుంది. గత సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిన గవర్నర్ ప్రసంగ ప్రతికి తాను కొన్ని మార్పులు చేసుకుంటున్నట్టు గవర్నర్ సూచించడంతోనే అసలు వివాదం ప్రారంభమైందని చెప్పుకోవాలి. రాష్ట్ర మంత్రిమండలి అధికార పరిధిని ఉల్లంఘిస్తూ గవర్నర్ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రస్తావిస్తాననడంపై కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని వెనుక గవర్నర్ కు రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ పనితీరును చులకన చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న భారతీయ జనతా పార్టీకి మేలు చేసే విధంగానే గవర్నర్ నడుచుకుంటున్నారన్న ఆరోపణలు చేశారు. అందుకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె రాజకీయ నేపథ్యాన్నీ వారు కారణంగా చూపించారు. రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరించాల్సిన గవర్నర్లు వారి వారి రాజకీయ నేపథ్యాల మేరకు పూర్తి రాజకీయ నాయకులుగా వ్యవహరిస్తున్నారంటూ పలు ఆరోపణలు కూడా టిఆర్ఎస్ నేతలు చేశారు. ఇది కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లోనూ ఇదే తరహా పరిణామాలు ఎదురయ్యాయని వారు సూచిస్తున్నారు.



కేంద్రం పై అసంతృప్తిలో రాష్ట్రం... గవర్నర్ చదువుతారా!!!

గవర్నర్ ప్రసంగం ఎలా ఉండబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన మేరకే వుంటుందన్న అంచనా మేరకే గవర్నర్ నడుచుకుంటారా లేదా పోయినసారి లేవనెత్తినట్టు సొంతంగా మరికొన్ని అంశాల ప్రస్తావన చేస్తారా అన్నది చూడాల్సిన అంశం. అయితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలోని బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈమధ్య విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సాధకబాదకాలన్నీటినీ మంత్రిమండలి ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగంలో చేర్చే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు ఇవ్వకపోగా.. రావాల్సిన బకాయిలను సైతం విస్మరించారన్న విమర్శలు బి ఆర్ ఎస్ పార్టీ మంత్రులు బహిరంగంగానే చేశారు. అటువంటి సందర్భంలో రాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లోని గవర్నర్ ప్రసంగంలో వాటి ప్రస్తావన కచ్చితంగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. మరి గవర్నర్ వాటిని యధాతధంగా చదువుతారా లేదా తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవికుమార్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తాను అభ్యంతరాలు వ్యక్తం చేసి మరోసారి వివాదాల కు తెరతీస్తారా చూడాలి.

తమిళనాడు లో ఏం జరిగింది..??

తమిళనాడులో కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర మంత్రి మండలి రూపొందించిన గవర్నర్ ప్రసంగప్రతిలోని కొన్ని అంశాలను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవికుమార్ ఉద్దేశపూర్వకంగా చదవకపోవడంతో ఆయన తీరుపైట్ల అక్కడి అధికార డిఎంకె పార్టీ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేసింది. గవర్నర్ ప్రసంగాన్ని తిరస్కరిస్తూ అసెంబ్లీ అక్కడికక్కడే తీర్మానం చేయడం ఆ తీర్మానం జరుగుతుండగానే గవర్నర్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. గవర్నర్ వెళ్ళిపోతున్న సమయంలో జాతీయ గీతాలాపన జరుగుతున్న ఆయన ఆగలేదని ఆయన పూర్తిగా తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారన్న తీవ్ర ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దీనిపై రాష్ట్రపతికి సైతం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖ రాయడం గుర్తుండే ఉంటుంది. మరి స్వయంగా తమిళనాడు వ్యక్తి అయినా తమిళసై ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటారా లేదా తాను అదే తరహా వ్యవహరించి మరోసారి ప్రాంతీయ సెంటిమెంట్లు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం అన్న వివాదానికి తెరలేపుతారా చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story