Editorial: "నల్లగొండలో కామ్రేడ్ల మాస్టర్ ప్లాన్.. వర్క్ ఔట్ అవుతుందా..?"

Editorial: నల్లగొండలో కామ్రేడ్ల మాస్టర్ ప్లాన్.. వర్క్ ఔట్ అవుతుందా..?
తెలంగాణలో వామపక్షాల జోరు

మొన్నటి మునుగోడు ఉపఎన్నికల్లో వామపక్షాలు BRS పార్టీకి మద్దతు ఇచ్చిన సంగతి తెల్సిందే. ఆ ఎన్నికల్లో.. గులాబీ పార్టీ అంగబలం, అర్థబలం ఉపయోగంచినప్పటికీ.. కేవలం 10వేల ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. వామపక్షాల మద్దతుతోనే బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బైటపడ్డారనేది ఓపెన్ సీక్రెట్.

అప్పటినుంచి నల్లగొండ జిల్లా సహా తెలంగాణవ్యాప్తంగా కమ్యూనిస్టుల గ్రాఫ్ తోపాటు.. ప్రాధాన్యత అమాంతంగా పెరిగిందని చెప్పొచ్చు. మునుగోడు బైపోల్ కోసమేకాదు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. ఆతర్వాత దేశంలో ప్రజావ్యతరేక పాలన కొనసాగిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తామంటూ.. ఇటు గులాబీ బాస్ "సీఎం కేసీఆర్".. అటు వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు గొంతు కలిపారు. ఈక్రమంలోనే వామపక్షాల్లో ముఖ్యంగా సీపీఎం అడుగు ముందుకేసి.. అనుబంధ సంఘాలను యాక్టివ్ చేస్తోంది. రైతు సంఘాలు, కార్మిక సంఘాలు సహా అని విభాగాల్లో పునరుజ్జీవం పోస్తోంది.

గతంలో నల్లగొండ జిల్లా పరిధిలో.. వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐలకు గట్టి పట్టు ఉండేది. "నల్లగొండ", "నకిరేకల్", "మిర్యాలగూడ" అసెంబ్లీ సెగ్మెంట్లలో.. సీపీఎం పలుమార్లు విజయం సాధించింది. సీపీఐ సైతం.. దేవరకొండ, మునుగోడు సెగ్మెంట్లలో గెలుపుబావుట ఎగరేసింది. 2014 నుంచి 2022 మునుగోడు ఉపఎన్నిక వరకు.. గులాబీ పార్టీతో వామపక్షాలకు చాలా గ్యాప్ ఉండేది. కానీ మునుగోడనే బలమైన అవసరం వీళ్లను కలిపింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో.. గులాబీ పార్టీతో వామపక్ష పార్టీలకు పొత్తు కుదిరితే.. నల్లగొండ జిల్లా పరిధిలోని "మిర్యాలగూడ" నియోజకవర్గంతోపాటు.. "నల్లగొండ", "నకిరేకల్" లను సీపీఎం అడుగుతుందట.

మరీ ముఖ్యంగా "మిర్యాలగూడ నియోజకవర్గం" పై సీపీఎం అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందట. ఇక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి "నల్లమోతు భాస్కరరావు" ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ అనుకున్నట్లుగా జరిగి గులాబీ పార్టీతో పొత్తు కుదిరితే.. పక్కాగా "మిర్యాలగూడ" సీటు కోరే అవకాశం ఉందట. 1994, 2004, 2009 ఎన్నికల్లో మూడుసార్లు ఇక్కడ సీపీఎం పార్టీ గెలిచింది. సీపీఎం శాసనసభ పక్షనేతగా పనిచేసిన జూలకంటి రంగారెడ్డిని పార్టీ తరఫున బరిలో దింపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే మరోమారు మిర్యాలగూడ నియోజకవర్గంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారట. ప్రస్తుతం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా జూలకంటి రంగారెడ్డి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. గ్రామస్థాయిలో పార్టీ శాఖలను బలోపేతం చేస్తూ.. మండల, నియోజకవర్గస్థాయి పార్టీ కమిటీల అనుబంధ సంఘాల సమావేశాలతో బిజీగా ఉన్నారట. దీంతోపాటు స్థానిక ప్రజా సమస్యలపై కూడా దృష్టి సారించి.. పాదయాత్రలు, ఆందోళన కార్యక్రమాలతో దూకుడు పెంచారట. ముఖ్యంగా నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగానికి నీటి విడుదల విషయంలోనూ.. పారాబాయిల్డ్ రైస్ మిల్లుల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు, కార్మికసంఘాలను కలుపుకోవడంలోనూ జూలకంటికి మంచి పేరుంది.

గతంలో మూడు పర్యాయాలు సీపీఎం జెండా ఎగరేసిన మిర్యాలగూడ అసెంబ్లీ సెగ్మెంట్లో.. మరోమారు సత్తా చాటడానికి ఆ పార్టీ శ్రేణులు సన్నద్ధంగా ఉ్ననాయట. దీంట్లో భాగంగానే మిర్యాలగూడ స్థానికులు, రైతు సమస్యలపై పోరాటాలు చేపడుతున్నారు జూలకంటి. వీటితోపాటు దామరచర్ల ప్రాంతంలో అర్హులైన లబ్ధిదారులకి "పోడు భూములను" ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న మిర్యాలగూడ ప్రాంతంలోనే.. పార్టీ జాతీయ నాయకురాలు "బృందాకారత్" ముఖ్యఅతిథిగా.. త్వరలోనే 'రాష్ట్రస్థాయి గిరిజన మహాసభలు' ఏర్పాటు చేస్తున్నారట. మొత్తానికి సీపీఎం పార్టీ రెండో ఇన్నింగ్స్ లో జైత్రయాత్రను మిర్యాలగూడ నుంచే ప్రారంభించాలని పక్కా ప్లాన్ తో వెల్తున్నారట. ఎర్రజెండాల వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి మరి.

Tags

Next Story