Editorial: కేసీఆర్ ఖమ్మం సభ సారాంశం ఏంటి!!

హైదరాబాద్
Editorial: కేసీఆర్ ఖమ్మం సభ సారాంశం ఏంటి!!
2019 ఎన్నికల మోడీ ప్రభావం మళ్లీ పడకుండా జాగ్రత్త పడుతున్నాడా!

బీఆరెస్ ద్వారా కేసీఆర్ లక్ష్యం తెలంగాణతో పాటు పార్లమెంటు సీట్లు కూడానా!! 2019 ఎన్నికల మోడీ ప్రభావం మళ్లీ పడకుండా జాగ్రత్త పడుతున్నాడా! ఎస్పీ, ఆప్ పార్టీలనుంచి మాట సాయం సరేకానీ ఓటు సాయం దక్కుతుందా! కమ్యూనిస్టులతో పొత్తు ఉభయకుషలోపరి మంత్రమా లేక నేతల కలయిక కాంగ్రెస్ కు మరింత శాపమవుతుందా!!!


2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ అత్యంత పేలవమైన ప్రదర్శన చూపించిన ఖమ్మంలో కేసీఆర్ తన నూతన రాజకీయ ప్రస్థానాన్ని ప్రకటించారు. భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న టిఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో తన పాత్ర ఎలా ఉండబోతుందన్న విధాన ప్రకటన చేయడానికి కేసీఆర్ ఖమ్మం వేదికగా ఎంచుకున్నారు. ఇది కేవలం తమ పార్టీ సమావేశంగా మాత్రమే పరిమితం చేయకుండా దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఇతర పార్టీల నేతలనూ ఈ సమావేశానికి ఆహ్వానించారు.


ఇదే వేదిక నుంచి నలుగురు ముఖ్యమంత్రులు, సీపీఐ, సమాజ్వాది పార్టీ ల అధినేతలు పాల్గొని ప్రసంగించారు. సభకు ఒక రోజు ముందుగానే కెసిఆర్ నివాసం చేరుకున్న నేతలతో ఆయన సుదీర్ఘ మంతనాలు చేశారు మరుసటి రోజు తెలంగాణ ప్రభుత్వం సుమారు 1200 కోట్లతో ఏర్పాటు చేసిన యాదాద్రి నూతన ఆలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత ఖమ్మం లో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన, సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభం, కంటి వెలుగు పథకం రెండో విడత ప్రారంభోత్సవం చేశారు. దారి పొడవునా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు పథకాల వివరాలు ముఖ్యంగా వ్యవసాయం, రైతులు కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను నేతలకు వివరించే ప్రయత్నం చేశారు కేసీఆర్. కెసిఆర్ సభలంటే సాధారణంగానే జన సమీకరణ భారీగా ఉంటుంది ఖమ్మంలో కూడా అదే తరహా భారీ జన సమీకరణకు ఏర్పాటు చేసుకున్నారు. సభకు ముఖ్య అతిథులుగా హాజరైన అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్ లాంటి నేతలు హాజరైన జన సమూహాన్నిచూసి ఇంప్రెస్ అయ్యారు.


ఇంతకీ ఈ మీటింగ్ లక్ష్యం ఏంటిన్నది చర్చ.

జాతీయ స్థాయిలో భూమిక పోషిస్తున్న నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించడం ద్వారా తెలంగాణ ఎల్లలు దాటి మీటింగ్ అందరి దృష్టినీ ఆకర్శించింది.. ఏపీ, తెలంగాణ, చత్తీస్‌ఘడ్ మూడు రాష్ట్రాల సరిహద్దులో వున్న జిల్లా కావడంతో ఖమ్మంకి మరింత ప్రాధాన్యత దక్కింది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ ప్రభుత్వ పథకాలను ప్రశంసించడంతో.. కెసిఆర్ ప్రభుత్వ పనితీరుకు మంచి సర్టిఫికెట్ పొందగలిగారు. అతిథులుగా హాజరైన పినరయి విజయన్, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, రాజా లు బిజెపి విధానాలను తూర్పారబట్టడం కేసిఆర్ కు స్వరాష్ట్రంలో కలిసివచ్చే అంశం. తద్వారా ఉపఎన్నికలూ, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో గట్టి పోటీఇచ్చిన బీజేపీకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసారు. జాతీయ స్థాయిలో కూడా కీలక పాత్ర పోషిస్తామని చెప్తున్న నేపథ్యంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే తమ ప్రాధాన్యతలు ఎలా ఉంటాయని చెప్పుకునేందుకు కేసిఆర్ ఈ వేదికని వినియోగించుకున్నారు. రేపటి జాతీయ రాజకీయాల్లో తమకు ప్రాధాన్యత దక్కాలంటే పార్లమెంటు స్థానాలు అధికంగా గెలుచుకోవాల్సిన అవసరాన్ని కెసిఆర్ ఎప్పుడో గుర్తించారు.


2024లో మోడీ హవాకు తెరేసేందుకేనా!

2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగలిగినా ఆరు నెలల అనంతరం 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తొమ్మదిమంది ఎంపీలను మాత్రమే దక్కించుకోగలిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానం దక్కించుకున్న బిజెపి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి నాలుగో ఎంపీలను గెలిపించుకోగలిగింది. ఇక్కడే తెలంగాణలోనూ మోడీ హవా సాగే అవకాశముందన్న సంకేతాన్ని కేసీఆర్ పసిగట్టివుండొచ్చు. కేవలం తెలంగాణలో మాత్రమే కాదు మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీలు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి చతికిలబడటం గమనించాం. మోడీ చరిష్మా , అమిత్ షా చాతుర్యం కలిసి సాగుతున్న బీజేపీ జైత్రయాత్రను అడ్డుకుని పార్లమెంట్ ఎన్నికల్లో సానుకూల ఫలితం సాధించడం ప్రాంతీయ పార్టీలకు మరింత కష్టం. అందుకే కేసీఆర్ ఈసారి కొత్త వ్యూహాన్ని పన్నారన్న విశ్లేషనలున్నాయి. ప్రత్యర్ధిని వారి తరహాలోనే ప్రతిఘటిస్తే స్వరాష్ట్రంలో అనుకూలతలు కనిపిస్తాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ చేసిందదే.


దీర్ఘకాలిక వ్యూహంలతో కేసీఆర్..

అందుకే టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారి జాతీయ రాజకీయాల్లో విధానపరమైన మార్పులు తీసుకొస్తుందని ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ వల్ల దేశానికి నష్టం జరుగుతుందని మోడీ అమిత్ షా లు వ్యవసాయం, విద్యుత్తు, ఆర్థిక అంశాలపై విఫలం చెందిందని చెప్పే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. తద్వారా కేవలం అసెంబ్లీకి మాత్రమే కాదు పార్లమెంట్ ఎన్నికల్లోను బీఆర్ఎస్ బిజెపికి ఎదురు నిలబడగల సైతాంతిక పునాదిని నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా బలంగా ఉన్న బిజెపిని ఎదుర్కోవాలంటే ప్రాంతీయ పార్టీల ఐక్యత అవసరమన్న వాదనను నేత్తికెత్తుకున్నారు. ఆపని చేయడంలో కాంగ్రెస్ విఫలం ఐందని కేసీఆర్ బలంగా విశ్వసిస్తున్నరు కూడా. పైగా మోడీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ బలహీనతలు ప్రతిపక్షాలకూ నష్టం కలిగించాయనే వాదనలున్నాయి. అందుకే రాష్ట్రాల్లో బలంగా ఉన్నప్పటికీ కేంద్రంలో బిజెపిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్న అరవింద్ కేజ్రీవాల్, కుమారస్వామి, అఖిలేష్ యాదవ్ లాంటి నేతల జట్టు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఖమ్మం సభకు వచ్చిన ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు బిజెపి మతతత్వ సిద్ధాంతాలను ఎండబెడితే, అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రాలపై కేంద్ర ఆధిపత్యం, గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగపరచడం వంటి అంశాలపై మాట్లాడారు. ఆపరంగా కెసిఆర్ ఖమ్మం సభ సఫలమైందనే చెప్పొచ్చు. ఖమ్మంలో తమకు స్థానికంగా ఉన్న అంతర్గత విభేదాలను అధిగమిస్తూ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలు చేజారినా పార్టీకి నష్టంలేదని చెప్పేందుకూ, బిజెపి విధానాలకు దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉందన్న సంకేతం ఇచ్చేందుకు కూడా ఆయనకు ఈ సమావేశం ఉపయోగపడింది.


ఓట్లు పడతాయా మరి

విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే అని చెప్తూనే కేసీఆర్ తమ పార్టీ దేశవ్యాప్తంగా ఏం చేస్తుందనే హామీలను ఇవ్వడం ఆసక్తికర అంశం. ఎందుకంటే స్వంతంగా ఢిల్లీ పీఠం దక్కించుకునే అవకాశం అంతమాత్రంగానైనాలేని కేసీఆర్ పార్టీ అంత భారీ హామీలివ్వడం స్ధాయికి మించి చేసిన సాహసమే. కేవలం 17 పార్లమెంటు స్థానాలు ఉన్న తెలంగాణలో టిఆర్ఎస్ ఎంత బలంగా ఉన్నా తెలంగాణ వెలుపల ఆ పార్టీ ఎంపీ స్థానాలు గెలవడం కష్టమే. పైగా విపక్షనాయకుల్లో మమత, కేజ్రీవాల్, నితీష్, అఖిలేష్ ఎవర్ని చూసినా పీఎం అభ్యుర్దులమనిపించుకోవాలన్న తపన కనిపిస్తుంది. అటువంటిది కేసీఆర్ హామీలకు వారెందుకు వత్తాసు పలుకుతారు. బహుశా అందుకే కాబోలు కేజ్రీవాల్ కేసీఆర్ డిల్లీ ప్రభుత్వ మొహల్లా క్లినిక్ లను చూసొచ్చి కేసీఆర్ ఈ కార్యక్రమం చేపట్టారని తమ ఘనతను చెప్పుకున్నారు. ఇక్కడ అన్ని పార్టీలు వారి వారి రాష్ట్రాలకు మాత్రమే పరిమితమై ఉన్నందున ఒకరికొకరు కలిసి బీజేపీకి ప్రత్యామ్నాయంగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎన్నికల్లో ఏపార్టీ ఓటూ మరో పార్టీకి కలిసొచ్చే అవకాశమే లేదన్న విషయం గమనించాలి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మాత్రం తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తుంటే తమకు లాభిస్తుందన్న ఆలోచనతోనే ఉన్నట్టు అర్థమవుతుంది. కేరళ మినహా మరెక్కడా అధికారంలోకొచ్చే అవకాశం వారికి లేదు కాబట్టి వారికున్న పరిమిత ఓటు బలంతో బీజేపీని అడ్డుకునేందుకే ప్రత్యామ్నాయ పార్టీలకు వామపక్షాలు మద్దతిచ్చే అవసరం వారికుంది. అందుకే పొత్తుకు సిద్దమనే సంకేతాలు పంపుతున్నారు. మునుగోడు ఎన్నిక ద్వారా రాష్ట్రంలో కమ్యూనిస్టుల బలం తనకి ఎంత అవసరమో కేసీఆర్ కూడా గ్రహించారు.

ఏది ఏమైనా ఖమ్మం సభద్వారా కేసీఆర్ కలిసొచ్చే కమ్యూనిస్టు పార్టీలతో ఓటు సాయం, మిగతా పార్టీతలో మాట సాయం పొందే ప్రయత్నం చేసారు. తద్వారా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాకుండా ఆ తర్వాతి పార్లమెంటుఎన్నికల్లోనూ మోడీ చరిష్మాను అడ్డుకునే వ్యూహంలో కేసీఆర్ వున్నారు. ఈ క్రమంలో బీజేపీని ఓడించే లక్ష్యాన్ని వీరంతా కలిసి చేరుకున్నా లేకున్నా పోటీనుంచి కాంగ్రెస్ ను మరింత వెనక్కు నెడతారేమో అనిపిస్తుంది.


- pradeep kumar bodapatla

input editor, tv5

Tags

Next Story