కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దం : ఈటెల

పథకం ప్రకారమే తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఈటల రాజేందర్. 66 ఎకరాల భూమి ఆక్రమించినట్లు నివేదిక ఎలా ఇస్తారన్నారు? తనకు నోటీసులు ఇవ్వకుండానే చర్యలు తీసుకున్నారన్నారు. ప్రభుత్వం, అధికారులు చేతి కింద ఉన్నారని ఇలాంటి చర్యలకు పాల్పడతారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుపై త్వరలోనే కోర్టుకు వెళ్తానన్నారు ఈటల. కోర్టు దోషిగా తేల్చితే ఎలాంటి శిక్ష అయినా సిద్ధమేనని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన ఆధీనంలో ఉన్న భూములన్నీ తాను కొనుక్కున్నవే అన్నారు. చట్టాల్ని గౌరవించాలి కానీ అతిక్రమించకూడదన్నారు.
గ్యాంగ్ స్టర్ నయీం చంపుతానంటే భయడపలేదని, అలాంటిది ఇలాంటి వాటికి భయపడతానా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనలాంటి సామాన్యుడిపై కేసీఆర్ అధికారాన్ని ఉపయోగించారన్నారు. జమున హ్యాచరీస్‌తో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. తనకు సంబంధం లేని భూముల్లో సర్వే చేశారన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై కనీసం వివరణ కూడా తీసుకోకుండా రిపోర్ట్ రెడీ చేయడం ఏంటని ప్రశ్నించారు. అధికారులు సమర్పించిన నివేదికలో అన్నీ తప్పులే ఉన్నాయని, సంబంధం లేని భూములను తనకు అంటగడుతున్నారని చెప్పుకొచ్చారు. అరెస్టులకు, కేసులకు భయపడేంత చిన్నవాడిని కానని కామెంట్ చేశారు.
కొత్త పార్టీ పెట్టడంపై ఈటల రాజేందర్ కామెంట్ చేశారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచనేమీ లేదన్నారు. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని మాత్రమే చెప్పుకొచ్చారు. గెలుపు అనేది పార్టీ బి-ఫామ్ ఇస్తే రాదని, ప్రజల ఆమోదం ఉంటేనే గెలుపు సాధ్యమని అన్నారు. సుదీర్ఘకాలంగా కేసీఆర్‌తో కలిసి పనిచేశానని, 2008లో పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేశానన్నారు. పార్టీకి నష్టం చేకూర్చే పని తాను ఏనాడు చేయలేదన్నారు. గత మూడ్రోజులుగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులుగా కనీసం గౌరవం దక్కితే చాలనుకున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈటల. మంత్రివర్గంలో ఆత్మగౌరవంతో పనిచేస్తున్న మంత్రులు ఎవరూ లేరన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com