Hanumakonda District: 16 ఎకరాలు ఇచ్చినా.. తండ్రిని ఇంట్లోంచి గెంటేశారు!

కొడుకులు ఉన్నా అన్నం పెట్టే దిక్కు లేరని, పెన్షన్ కోసం ఇంటి నుంచి గెంటేసారని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు గ్రామానికి చెందిన పిల్లల నారాయణ (89) ప్రజావాణిలో కలెక్టర్ ముందు కన్నీటి పర్యంతమయ్యాడు. కొడుకులకు 16 ఎకరాల ఆస్తి పంచి ఇచ్చినా తనను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వృద్ధాప్యంలో నడవడం చేతగాక చక్రాల కుర్చీలో ఉంటూ జీవనం సాగిస్తున్న నారాయణ విశ్రాంత ఉపాధ్యాయుడు. ఆయనకి నలుగురు కుమారులు కాగా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కాగా ఒకరు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. మరొకరు గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే నారాయణ తన 16 ఎకరాల భూమిని అందరికీ సమానంగా పంచి ఇచ్చి, తనకు వచ్చే పింఛన్ డబ్బులతో జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఉద్యోగాలు చేసుకుంటున్న ముగ్గురు కుమారులు పింఛన్ డబ్బుల కోసం వేధిస్తూ ఇంటికి తాళం వేసి తనను బయటకు గెంటేశారని నారాయణ ప్రజావాణిలో గోడు వెల్లబోసుకున్నాడు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నానని, కుమారులు ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను వేడుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com