Huzurabad By Poll Result : హుజురాబాద్‌ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం.. కౌంటింగ్‌ కేంద్ర వద్ద 144 సెక్షన్‌..!

Huzurabad By Poll Result :   హుజురాబాద్‌ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం.. కౌంటింగ్‌ కేంద్ర వద్ద 144 సెక్షన్‌..!
Huzurabad By Poll Result : తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉప ఎన్నికలు జరిగినా అందరి చూపు హుజురాబాద్‌పైనే. అంతటి ఉత్కంఠ రేపుతున్న హుజురాబాద్‌ ఫలితం మంగళవారం వెలువడనుంది.
Huzurabad By Poll Result : తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉప ఎన్నికలు జరిగినా అందరి చూపు హుజురాబాద్‌పైనే. అంతటి ఉత్కంఠ రేపుతున్న హుజురాబాద్‌ ఫలితం మంగళవారం వెలువడనుంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన 30మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చే ఓట్ల లెక్కింపుకు అధికారులు సర్వంసిద్ధం చేశారు. ఉదయం 8 గంటలకు కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీలో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒక్కో హాల్లో ఏడు టేబుల్స్‌ చొప్పున 14 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. మొదటి అరగంట పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. బైపోల్‌ లో మొత్తం 753 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత అభ్యర్థులు లేదా అభ్యర్థుల ఏజెంట్ల ముందు ఈవీఎంలను తెరుస్తారు.

కౌంటింగ్‌ ప్రక్రియ 22 రౌండ్లలో ముగియనుంది. ఒక్కో రౌండ్‌కు 14 ఈవీఎంలను లెక్కిస్తారు. హుజురాబాద్‌ బైపోల్‌ లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదుకావడంతో ఫలితం వెలువడడానికి ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా లెక్కింపు ప్రక్రియ కొనసాగేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బంది, సూపర్‌వైజర్ల ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.

కౌంటింగ్‌ కేంద్రంలో కోవిడ్‌ నిబంధనలు కఠినంగా పాటించనున్నారు. పార్టీల ఏజెంట్లు, కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించారు. ఇక కౌంటింగ్‌ కేంద్రం వద్ద 144 సెక్షన్‌ను అమలు చేస్తున్న అధికారులు... పటిష్ట పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ర్యాలీలు, ఉరేగింపులపై నిషేధం విధించారు.

మరోవైపు బైపోల్‌ ఫలితంపై ఏ పార్టీ అంచనాలు ఆ పార్టీకున్నాయి. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నా లోలోపల ఓ విధమైన టెన్షన్‌ నెలకొంది. హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రధానంగా పోటీచేసిగా... అసలు పోటీ మాత్రం టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యనే ఉండనుంది. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి చీల్చే ఓట్లు టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థుల తలరాతలను మార్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా.

ఉప ఎన్నికల సెడ్యూల్‌ రాకముందునుంచే హుజూరాబాద్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన టీఆర్‌ఎస్‌, బీజేపీలలో ఓటరు ఎవరికి కరుణించాడో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అప్పటివరకు ఆయా పార్టీలు, అభ్యర్థుల్లో టెన్షన్‌ తప్పకపోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story