GHMC Council Meeting : జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీట్ లో రసాభాస

జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రసాభాసగా మారింది. సభలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. అయితే సభ ప్రారంభమైన కాసేపటికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రతన్ టాటాలకు సంతాపం తెలిపారు. సంతాపం అనంతరం ముందుగా బడ్జెట్ ప్రవేశపెడుతామని మేయర్ ప్రకటించారు. ముందు ప్రజా సమస్యలపై మాట్లాడాలని, ఆ తర్వాతే బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మేయర్ పోడియం ముట్టడికి బీఆర్ఎస్ సభ్యులు యత్నించారు. దీంతో కాంగ్రెస్ కార్పొరేటర్లు CN రెడ్డి, బాబా ఫసియుద్దీన్ అడ్డుకుని, బీఆర్ఎస్ సభ్యుల నుంచి ప్లకార్డులు లాక్కొని చించేశారు. దీంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఒకరినొకరు తోసేసుకున్నారు.
మేయర్ పోడియం వద్దకు చేరుకుని బీఆర్ఎస్ సభ్యులు మేయర్ పోడియంపై ప్లకార్డులు విసిరారు. దీంతో ఐదు నిమిషాల పాటు సభను వాయిదా వేశారు మేయర్. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ సభ్యుల ఆందోళనను విరమించలేదు. సభ నడవడానికి సభ్యులు సహకరించాలని మేయర్ కోరారు. బడ్జెట్ పై చర్చించాల్సిన అవసరం ఉందని, సహకరించాలని మేయర్ కోరినప్పటికీ సభ్యులు ఆందోళన విరమించలేదు. సభ్యులు ఎంతకూ ఆందోళన విరమించకపోవడంతో మేయర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025- 26 ఆర్థిక సంవత్సరానికి 8 వేల 440 కోట్ల రూపాయల బడ్జెట్ ఆమోదిస్తూ ప్రకటన చేశారు. సభ్యులు సహకరించకపోవడంతో మేయర్ విచక్షణాధికారంతో బడ్జెట్ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com