చినుకు రాక అల్లాడుతున్న రైతులు

చినుకు రాక అల్లాడుతున్న రైతులు
తెలుగు రాష్ట్రాల్లో చినుకు జాడ లేక రైతులు అల్లాడిపోతున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు వారాలు దాటుతున్నా నైరుతి రుతుపవనాలు పలకరించడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో చినుకు జాడ లేక రైతులు అల్లాడిపోతున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు వారాలు దాటుతున్నా నైరుతి రుతుపవనాలు పలకరించడం లేదు. ఎండలు దంచి కొడుతుండడంతో ఇవేమీ ఎండలు బాబోయ్‌ అంటూ తలలు పట్టుకుంటున్నారు. రోహిణి కార్తె ముగిసి మృగశిర కార్తె ప్రారంభమైంది. సాధారణంగా ఈ కార్తె నుంచే వర్షాలు కురుస్తాయి. కానీ ఇప్పటికీ 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే జూన్ మూడో వారం వచ్చేసింది. కానీ నైరుతి రుతుపవనాల జాడ కనిపించడం లేదు. ఏటా ఈ సమయంలో సాధారణానికి మించి వర్షాలు పడితే రైతులు విత్తనాలు విత్తు కునే వాళ్లు. దుక్కులు దున్ని నాట్లు వేసేం దుకు సిద్ధంగా ఉన్న రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. చినుకు పడక పొలాలు పదును కాలేదు. పొలాలు పదును కానందున ఇప్పటి వరకు విత్తనం పడలేదు. నెల క్రితమే వేసవిలోనే పొలాలను బాగు చేసుకున్నారు. విత్తనాలు చల్లేందుకు భూములు సిద్దం చేసి ఉంచిన రైతులు.. వేయి కళ్లతో వర్షం కోసం నిరీక్షిస్తున్నారు. అటు.. ఎండక నెర్రెలిచ్చిన భూములు తొలకరి కోసం తపించిపోతున్నాయి.

తొలకరి జల్లు పడగానే వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతారు. ఆశించిన రీతిలో పంట దిగుబడి రావాలని ఇష్టదైవాలకు మొక్కులు తీర్చుకుంటారు. గతేడాది ఈ సమయానికి నారు పోయగా ఈ సారి భిన్నంగా తయారైంది. దుక్కి దున్ని నారు పోసుకుందామని విత్తనాలు సిద్ధం చేసుకొని రైతులు ఎదురు చూస్తున్నారు. ఏటా జూన్‌లో వర్షాలు ప్రారంభమై జూలై, ఆగస్టు మాసాల్లో అత్యధికంగా కురుస్తాయి. జూన్‌లో కనీసం సాధారణ వర్షపాతం నమోదైనా రైతులు పంటలు వేస్తారు. భారీ వర్షాలు కురిసే నాటికి పంటలు దెబ్బ తినకుండా ఉంటాయి. వర్షాలు ఆలస్యంగా కురిస్తే పంట దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఈ సారి రైతులు ఆశించిన సమయానికి వర్షాలు కురుస్తాయనే ఆశతో సాగు పెరుగుతుందని ఆశించారు. ఆరుతడి పంటలను పండించే రైతులు మే నెల నుంచే వేసవి దుక్కులు దున్ని భూమిని చదును చేసుకున్నారు. వర్షాలు కురిసిన వెంటనే మరొక సారి దుక్కి దున్ని అచ్చు కొట్టి విత్తనాలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. పత్తి పంటను సాగు చేసే రైతులు కొన్ని గ్రామాల్లో దుక్కులు దున్ని అచ్చు కొట్టి విత్త నాలు వేసేందుకు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. వరి పంటను సాగు చేసే రైతులు మాత్రం వ్యవసాయ బావుల వద్ద వరి నార్లు పోస్తున్నారు.

గత సంవత్సరం జూన్‌ 9న జిల్లాలో నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. జూన్‌ నెలలో సాధారణ వర్షపాతం 195.2 మిల్లీమీటర్లు కాగా 172.8 మిల్లీమీటర్లు కురిసింది. జూలైలో సాధారణ వర్షపాతం 338.5 మిల్లీమీటర్ల కాగా 822.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 143 శాతం అధిక వర్షం నమోదైంది. ఈ సారి వర్షాలు సరైన సమయానికి పడతాయో లేదోనన్న ఆందోళనలో ఉన్నారు రైతులు. ఏది ఏమైనా ఈ సారి రైతులను వరుణుడు కరుణించి గట్టెక్కిస్తాడో అనావృష్టితో ముంచుతాడో వేచి చూడాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story