Mulugu: అగ్నికి ఆహుతైన గ్రామం.. 40 ఇళ్లు పూర్తిగా దగ్ధం..

Mulugu: ములుగు జిల్లా ఉలిక్కి పడింది. మంగపేట మండలం శనిగకుంటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో గిరిజన కుటుంబాలు ఊరు వదిలి పరుగులు తీశాయి. ఈ ఘటనలో 40 ఇళ్లు ఆహుతయ్యాయి. గురువారం రాత్రి ఏడున్నర సమయంలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. ఆ సమయంలో అటవీ ప్రాంతం నుంచి మంటలు గ్రామంలోకి వ్యాపించాయి. సిలిండర్లు పేలడంతో.. మొత్తం 40 ఇళ్లు దగ్దమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన గిరిజనులు పిల్లాపాపలతో పరుగులు తీశారు.
అన్ని గడ్డి గుడిసెలు కావడంతో.. కేవలం నిమిషాల వ్యవధిలోనే.. కాలి బూడిదయ్యాయి. దీంతో ఆదివాసీలు కట్టుబట్టలతో మిగిలారు. గ్యాస్ సిలిండర్లు పేలుతుండటంతో.. ప్రజలు ప్రాణ భయంతో బయటికి పరుగులు తీశారు. పశువులు, మేకలను వదిలిపెట్టగా.. అవన్నీ అడవిలోకి పారిపోయాయి. గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఉండటంతో.. ఇళ్లన్నీ మంటలకు ఆహుతువుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆదివాసీలు ఉండాల్సి వచ్చింది. చీకట్లోనే బాధితులు రాత్రంతా గడిపారు. నిలువనీడ కోల్పోయి.. కన్నీరుమున్నీరవుతున్నారు గిరిజనులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com