Telangana Rains: పెల్లుబికిన ‘మున్నేరు’ కన్నీరు

మున్నేరు ఖమ్మం ముంపు ప్రాంతాల వాసులను కోలుకోలేని దెబ్బతీసింది. నిద్ర లేచేసరికి పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. కొందరు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఆర్థనాదాలు చేశారు. మరికొందరు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. వరద తగ్గుముఖం పట్టాక తమ ఇళ్లకు వెళ్లిన వారు కన్నీరు, మున్నీరవుతున్నారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని బాధితులు ఘోల్లుమన్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎటు చూసినా రోడ్లపై పొంగుతున్న వాగులు..బురద మునిగిన ఇళ్లు..అనేక గ్రామాల్లో కూలిన నివాసాలు.. కట్టుబట్టలతో రోడ్లపైకి చేరిన బతుకులు.. వరద నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న బస్తీలు.. పొలాల్లో మట్టి, ఇసుక మేటలు.. చనిపోయిన పశువులే కన్పిస్తున్నాయి. ప్రజలు గాఢనిద్రలో ఉన్న వేళ వరద చుట్టుముట్టింది.. తెల్లారేసరికి బతుకులు చిద్రమైపోయాయి. ఖమ్మం, మహబూబాబాద్, మణుగూరు, కోదాడల్లోని అనేక కాలనీల్లో కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి. మహబూబ్‌నగర్, నారాయణపేట, మెదక్ జిల్లాల్లోనూ వరద బీభత్సం సృష్టించింది. రహదారులే ఏరులయ్యాయి. డ్రైనేజీలు పిల్ల కాల్వలను తలపించాయి.
ఆగ్రహించిన మున్నేరు.. ఉప్పొంగిన వాగులు
తలాపునే ప్రవహించే మున్నేరు ఇంతలా కన్నీరు పెట్టిస్తుందని ఖమ్మంవాసులు ఎన్నడూ ఊహించలేదు. చరిత్రలో ఎప్పుడు రానంతగా మున్నేరుకు 36 అడుగుల మేర వరద రావడంతో కాలనీలు మునిగిపోయాయి. ఎటుచూసినా ఇళ్లు కనిపించనంత నీరు కమ్మేసింది. నగరం ఎగువ ప్రాంతంలో ఉండే దానవాయిగూడెం మొదలు ప్రకాశ్‌నగర్ వరకు వరద చుట్టుముట్టింది. మున్నేరు పరీవాహకమంతా సముద్రాన్ని తలపించిందంటే ఎంత భయానకమో ఊహించవచ్చు. ఇళ్లలోని సోఫాలు, పరుపులు, బీరువాలు, ఫ్రిజ్‌లు, టీవీలు వరద తాకిడికి కొట్టుకుపోయాయి. కార్లు, ఆటోలను కిలోమీటర్ల కొద్దీ వరద ఈడ్చుకెళ్లింది. మున్నేరు వరదను ముందుగా అంచనా వేయడంలో స్థానిక యంత్రాంగం విఫలమైంది. 2022లో 30.75 అడుగుల స్థాయిలో మున్నేరుకు వరదలు వచ్చాయి. ఇప్పుడు 36 అడుగుల వరకు వరద రావడం, ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉండటంతో ముంపు తీవ్రత పెరిగింది. అలాగే ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని అనేక మండలాల్లో వేల సంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి. మున్నేరు, పాలేరు, కిన్నెరసాని, పాలవాగు, ముర్రేడు, మల్లన్నవాగు, జిల్లేరు, ఆకేరు వాగులు ఎన్నడూ లేనంతగా ఉప్పొంగడంతో తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో పశువులు, మేకలు, గొర్రెలు కొట్టుకుపోయాయి. మణుగూరు పట్టణంలోనూ వరద పోటెత్తడంతో కాలనీలు మునిగిపోయాయి. పాల్వంచ, బూర్గంపాడు, గుండాల, టేకులపల్లి, కొత్తగూడెం, చుంచుపల్లి తదితర మండలాల్లో నష్టం చోటుచేసుకుంది. మహబూబాబాద్ పట్టణంలోని తొమ్మిది చెరువులు ఎఫ్‌ఆర్‌ఎల్ స్థాయికి మించి వరద పోటెత్తడంతో అదంతా బస్తీలను ముంచింది. పట్టణం ఎగువన ఉన్న ఈదుల పూసపల్లి వద్ద ఉన్న రాళ్లవాగు ఉప్పొంగింది.
భారీ వర్షాలు.. వరదలతో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తం అయింది. రహదారులు తెగిపోవడం, వంతెనలు, లోలెవల్ కాజ్‌వేలు, జాతీయ రహదారుల విధ్వంసంతో తీవ్ర నష్టం వాటిల్లింది. నీటిపారుదల శాఖ పరిధిలో 196 చెరువులకు, ప్రాజెక్టుల కింద 64 కాల్వలు, 600 ఇళ్లు ముంపునకు గురయ్యాయి. దీంతో సుమారు రూ.5,000 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com