Harish Rao : తెలంగాణలో గణనీయంగా తగ్గిన శిశు మరణాల రేటు.. మాజీ మంత్రి హరీశ్ రావు హర్షం

తెలంగాణ రాష్ట్రంలో శిశు మరణాల రేటు (Infant Mortality Rate - IMR) రికార్డు స్థాయిలో తగ్గిందని శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (SRS) నివేదిక-2023 వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం... దేశ వ్యాప్తంగా 2013లో 40 పాయింట్లుగా ఉన్న శిశు మరణాల రేటు 2023 నాటికి 25 పాయింట్లకు తగ్గింది. ఒక్క తెలంగాణ లోనే ఈ రేటు 18గా నమోదు అయిందని...ఇది జాతీయ సగటు కంటే మెరుగైన వృద్ధిని సూచిస్తుందని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 44 నుంచి 28కి, పట్టణ ప్రాంతాల్లో 27 నుంచి 18కి తగ్గినట్లు నివేదికలో స్పష్టం చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు మాజీ మంత్రి హరీశ్ రావు.
తెలంగాణలో శిశు మరణాల రేటు తగ్గడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం హయంలో చేపట్టిన పలు ఆరోగ్య సంక్షేమ పథకాలు ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయని హరీశ్ రావు గుర్తు చేశారు. కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు వంటి కార్యక్రమాలు గర్భిణీలు, శిశువుల సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆయన అన్నారు. ఈ చర్యలు వేలాది మంది తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడయని గుర్తు చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం నిజమైన ఫలితాలను సాధించిందని, ఇదే నిజమైన తెలంగాణ మోడల్ అని హరీశ్ రావు ఉద్ఘాటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com