Kamareddy District : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి.. అనుమానాలెన్నో!

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో శనివారం సాయంత్రం విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెద్ద చెరువులో పడి మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. దీనిని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులు ప్రకటించినప్పటికీ, మృతుల కుటుంబ సభ్యులు మాత్రం హత్యగా ఆరోపిస్తున్నారు. భర్త యేసు తన ముగ్గురు పిల్లలతో పాటు రెండో భార్యను చెరువులో తోసి హత్య చేశాడని చిన్నారుల బంధువులు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, బాధ్యులను శిక్షించాలనే డిమాండ్‌తో ఆసుపత్రి ఎదుట మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
ఈ ఘటనలో మృతులు మొదటి భార్య పిల్లలు మైథిలి, వినయ్, అక్షర, అలాగే రెండో భార్య మౌనికగా గుర్తించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో మరో సంచలన విషయం ఏమిటంటే, ఐదేళ్ల క్రితం భర్త యేసు తన మొదటి భార్య శ్యామలను కొట్టి చంపాడని కూడా ఆరోపణలు వినిపిస్తున్నా యి. అప్పట్లో కేసు విచారణలో ఏమైనా లోపాలున్నాయా? ప్రస్తుతం జరిగిన ఘటనకి సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల విచారణ తరువాత మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com