Hyderabad : యమ పాశంగా మారిన ఫ్రిజ్.. మహిళ మృతి...

Hyderabad : యమ పాశంగా మారిన ఫ్రిజ్.. మహిళ మృతి...
X

ఇంట్లో ఉన్న ఫ్రిజ్ ఆ మహిళ పాలిట యమ పాశంగా మారింది. భర్త దూరం అయిన ..ఇండ్లలో పని చేస్తూ ముగ్గురు కూతుర్లను పోషిస్తున్న ఆ మహిళ విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయింది. తండ్రి లేకపోయిన అన్నీ తానై చూసుకుంటున్న కన్న తల్లి కూడా అర్దంతరంగా దూరం కావడంతో ఆమె ముగ్గురు కూతుర్లు తట్టుకోలేక పోయారు. తల్లి శవం ముందు వాళ్ళు రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. ఈ విషాద ఘటన హైద‌రాబాద్‌లోని రాజేంద్ర న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జరిగింది.

పోలీసుల వివ‌రాల ప్ర‌కారం... హైద‌ర్‌గూడ ఎర్ర‌బోడ‌కు చెందిన లావ‌ణ్య‌(40)కు ముగ్గురు కూతుళ్లు. లావణ్య భ‌ర్త ప‌దేళ్ల కింద చనిపోవడంతో ఇళ్ల‌లో ప‌నిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. గ‌తేడాది పెద్ద‌కూతురుకు పెళ్లి చేయగా.. ఇటీవలే ఆమెకు కుమారుడు పుట్ట‌డంతో పుట్టింట్లోనే ఉంది. ఈ క్రమంలో వంట చేసేందుకు వెళ్లిన లావణ్య కూరగాయల కోసం ఫ్రిజ్ డోర్ తీసింది. ఒక్కసారిగా కరెంట్ షాక్ రావడంతో గట్టిగా కేకలు వేసింది. తల్లిని కాపాడడనికి పెద్ద కూతురు ప్రయత్నించిన సాధ్యం కాకపోవడంతో పక్కింటి వాళ్లను పిలిచింది. స్థానికుల స‌హ‌కారంతో త‌ల్లిని హైద‌ర్‌గూడ‌లోని ఓ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే లావణ్య మృతి చెందిన‌ట్టు వైద్యులు తెలిపారు. కన్న తల్లి కళ్ళముందే ప్రాణాలు కోల్పోవడం తో ఆ కూతురి వేదనకు అంతు లేకుండా పోయింది. ఐతే వర్షాకాలం లో ఇంట్లో ఉన్న ఎలెక్ట్రానిక్ వస్తువులతో జాగ్రతగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Tags

Next Story