Telangana Municipal Polls : తెలంగాణలో పార్టీల కుమ్మక్కు.. ఇదేం రాజకీయం.

మొన్నటిదాకా కత్తులు దూసుకున్న పార్టీలు ఇప్పుడు కుమ్మక్కు అయిపోతున్నాయి. ఒక పార్టీపై ఇంకో పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ మొన్నటిదాకా మున్సిపల్ రాజకీయాన్ని ఎంతగా వేడెక్కించాయో చూసాం. కానీ ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో భిన్నమైన రిజల్ట్ రావడంతో ఒక పార్టీతో ఇంకో పార్టీ సయోధ్య కుదుర్చుకుంటున్నాయి. తెలంగాణలో చాలా చోట్ల హంగ్ రావడంతో.. ఎవరికీ మెజార్టీ రానిచోట పార్టీల అభ్యర్థులు కలిసిపోతున్నారు. పవర్ షేరింగ్ పేరుతో జెండాలు ఒక్కటై పోతున్నాయి. ఒకరిపై ఒకరు మొన్నటిదాకా భగ్గుమన్న నేతలంతా ఇప్పుడు పార్టీల పవర్ షేరింగ్ కోసం చర్చలు జరపడం మరీ వింతగా ఉంది. అంటే ఎన్నికల ప్రచారంలో చెప్పింది అంతా ఉత్తదేనా. ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం అంటూ ఉంటుంది కదా. ఎన్నికల ప్రచారంలో దాన్నే బలంగా చెప్పిన పార్టీలు.. ఇప్పుడు మాత్రం దాన్ని ఎలా తప్పుతాయి.
మున్సిపాలిటీల్లో ఎవరికీ మెజారిటీ రాకపోవడం అంటే అక్కడ అన్ని పార్టీలు బలంగా పోరాడినట్టే కదా. ఒకరిపై ఒకరు విపరీతమైన ఆరోపణలు చేసుకుంటూ విమర్శలు చేసుకుంటూ ప్రచారాన్ని హోరెత్తించడం వల్లే ప్రజలు ఈ విధంగా తీర్పు ఇచ్చారు. ఇప్పుడు వాటన్నింటినీ పక్కనపెట్టి మేమంతా కలిసిపోయాం అంటే ఇక ప్రజలు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టినట్టే కదా. ఒకవేళ పొత్తులు పెట్టుకోవాలి అనుకుంటే ఎన్నికలకు ముందే పెట్టుకుంటే ఒక అర్థం ఉండేది. కానీ ఎన్నికల్లో కత్తులు చూసి ఇప్పుడు కరచాలనం చేయడం ఏంటి. పైగా ఈ పొత్తులు కూడా మున్సిపాలిటీల వరకే అని రాష్ట్రమంతా కాదు అంటూ చెప్పటం మరీ విడ్డూరంగా ఉంది.
అంటే ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి.. పార్టీ అనేది మున్సిపాలిటీ వరకు ఒక రకంగా రాష్ట్రమంతా మరో రకంగా ఉంటుందా. అంటే రేపు పొద్దున ఎక్కడ మెజార్టీ రాకపోతే అక్కడ పార్టీలు కలిసిపోతాయా. మరి కలిసిపోయే ఉద్దేశం ఉన్నప్పుడు ఈ స్థాయిలో ఆరోపణలు ఎందుకు చేసుకున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఆరోపణలు పసలేనివని వారే ఒప్పుకున్నట్టే అవుతుంది కదా. ఏదేమైనా గత చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఈసారి అత్యధిక మున్సిపాలిటీలో ఎవరికీ మెజారిటీ రాకపోవడం ఒక గొప్ప పరిణామం గానే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
