TG : టీచర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.. సీఎం రేవంత్ కు హరీశ్ లేఖ

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు టీచర్లు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పదోన్నతి పొందిన వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. 10,468 పండిత, పీఈటీ పోస్టుల అప్ గ్రేడేషన్‌కు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులు ఇచ్చిందన్నారు. సీఎం నిర్వహిస్తున్న సభలో సింహభాగం వారే కావడం గమనించాల్సిందిగా సూచిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం10,000 ప్రధానోపాధ్యాయ పోస్టులను మంజూరు చేస్తే ఇప్పటి వరకూ పాఠశాలలకు కేటాయించలేదన్నారు. వెంటనే కేటాయించి ఎస్‌జీటీలకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న ముఖాముఖిలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మరింత మెరుగైన పీఆర్ఈసీ ఎప్పుడు అమలుచేస్తారో విస్పష్టంగా ప్రకటించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కనీసం పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను ఎప్పుడు అనుమతిస్తారో ఆ సంగతన్నా సభలో ప్రకటిస్తే అందరూ సంతోషిస్తారన్నారు. న్యూ పెన్షన్ స్కీం స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీం తీసుకువస్తామన్నారు. ఎప్పటి నుంచి అమలుచేస్తారో సభలో ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. పాఠశాలలకు స్కావెంజర్స్‌ను అనుమతిస్తామన్నారు. అది ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదన్నారు. ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామన్నారు. ఇప్పటికీ దానిపై నిర్ణయం ప్రకటించలేదని హరీష్ రావు అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com