TG : మరింత కుంగిన పిల్లర్లు?.. అధికారుల క్లారిటీ

మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు మరింత కుంగినట్లు వార్తలు వస్తున్నాయి. గోదావరి నీటి వరద ప్రవాహం అతివేగంగా వస్తుండటంతో ఇప్పటికే కుంగిన 19, 20, 21 పిల్లర్లు ఆవేగాన్ని తట్టుకోలేక మరో ఫీట్ మేరకు కుంగినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ గత సంవత్సరం అక్టోబర్ 21న 19,20,21 పిల్లర్లు ఆరు అడుగుల మేరకు కుంగిపోయాయి.
ఈ నేపథ్యంలో నేషనల్ డ్యాంసేఫ్టీ అథారిటీ సూచనల మేరకు మేడిగడ్డకు చెందిన 85 గేట్లను ఎత్తి నీటి ప్రవాహాన్ని కిందికి వదులుతున్నారు. అలాగే తాత్కాలిక మరమ్మతులు పూర్తిచేసి నీటిపారుదల శాఖ ఉపిరి పీల్చుకుంటున్న తరుణంలో మేడిగడ్డ మరింత కుంగిందని తెలియడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం సెకనుకు ప్రవాహ వేగం 10 మీటర్లు ఉండటంతో ప్రవాహ వేగాన్ని కుంగిన పిల్లర్లు తట్టు కోలేక మరో అడుగు కుంగినట్లు తెలుస్తోంది.
గతవారంరోజులుగా మేడిగడ్డ నుంచి 73 టీఎంసీ నీరు ప్రవాహ వేగంతో దిగువకు వెళ్లింది. అయితే ఎగువ మహారాష్ట్ర నుంచి వస్తున్న భారీ వరద ప్రాణహిత నది నుంచి గోదావరిలో కలిసి ప్రవహిస్తోంది. ఈ ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక ఇప్పటికే కుంగిన పిల్లర్లు మరో ఫీట్ మేరకు కుంగినట్లు చెబుతున్నారు. ఐతే.. అవి వదంతులే అని అధికారులు చెప్పారు. భారీ ప్రవాహ వేగం కిందికి స్వేచ్ఛగా ప్రవహిస్తుండటంతో మేడిగడ్డ పిల్లర్లపై భారం పడటంలేదని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రవాహ వేగం అత్యధికంగా ఉండటంతో కుంగినట్లు భ్రమ కలుగుతున్నాయే కానీ వాస్తవం కాదని అధికారులు స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com