Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఓపెన్

శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు మూడు గేట్లను 10 అడుగుల మేర గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. కర్నూలు చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తిన అధికారులు, ఒక్కో గేటు నుంచి 27 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 6, 7, 8 గేట్లను ఎత్తడం ద్వారా మొత్తంగా 81 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు.
శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 135.78 టీఎంసీలుగా నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో ఇన్‌ఫ్లో 4,67,210 క్యూసెక్కులుగా ఉంది.జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 3,29,058 క్యూసెక్కుల వరద వస్తోంది. సుంకేసుల నుంచి శ్రీశైలానికి 1,40,478 క్యూసెక్కుల వరద వస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. దీంతో శ్రీశైలం రిజర్వాయర్ డ్యాం గేట్ల నుంచి 78,056 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేస్తున్నారన్న సమాచారంతో సందర్శకులు శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు భారీగా చేరుకున్నారు. కిందకు ప్రవహిస్తున్న కృష్ణమ్మ ఎగసిపడుతూ.. చల్లటి నీటి బిందువులను పర్యాటకులపై వెదజల్లుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com