గ్రేటర్ ఎన్నికలు : ఇవాళ్టి నుంచి ర్యాలీలు, రోడ్‌షోలకు ప్లాన్!

గ్రేటర్ నామినేషన్ల పర్వం ముగియడంతో.. ఇక పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. ఇవాళ్టి నుంచి ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. పార్టీల ముఖ్యనేతలు బస్తీ పర్యటనలకు సిద్దమవుతున్నారు. మంత్రి కేటీఆర్ రోడ్‌షోలు ఖరారయ్యాయి. ఇవాళ్టి నుంచి గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రోడ్‌షోలు చేయనున్నారు. ఇవాళ కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో కేటీఆర్ ప్రచారం చేయనున్నారు. ఆదివారం మహేశ్వరం, ఎల్బీనగర్‌లో కేటీఆర్ రోడ్‌షో నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రధానంగా గ్రేటర్‌లో అభివృద్ధి నినాదంతో ముందుకెళ్లనుంది. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ఇంటింటికీ తెలియజేయాలని ఇప్పటికే కేటీఆర్ అభ్యర్థులకు నిర్దేశనం చేశారు
అటు.. విపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలే ముఖ్యాంశాలుగా ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి. ఇప్పటికే బీజేపీ-టీఆర్‌ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ మోదీపై.. బండి సంజయ్ కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటు.. బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలంటూ టీఆర్‌ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ రెండు పార్టీల మధ్య ఇదే స్థాయి విమర్శలపర్వం ప్రచారంలోనే కన్పించే అవకాశం పుష్కలంగా ఉంది. అటు.. కాంగ్రెస్ టీఆర్ఎస్-బీజేపీ దొందు దొందే అంటూ ఇప్పటికే ఇరు పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతోంది. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని ప్రజలకు వివరించే ప్రయత్నంలో నేతలున్నారు. ఐతే.. టీడీపీ హయాంలోనే గ్రేటర్ అభివృద్ధి సాధ్యమైందని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సన్నద్ధమయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com