గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ వ్యుహాత్మక అడుగులు

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు పక్కా ప్లాన్ తో ముందుకువెళ్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టేందుకు వ్యుహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర నేతలతో పాటు జాతీయనేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.
మంగళవారం కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. కేంద్రం పథకాలను పూర్తి స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయడం లేదని మండిపడ్డారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని.. వరద బాదితులకు ఇవ్వాల్సిన సాయం కూడా గులాబీ నేతలు జేబులో వేసుకున్నారంటూ ఆరోపించారు.
ఇక ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం అగ్రెసీవ్ స్పీచ్ తో ప్రజలను ఆకర్షిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. కొత్త మెనిఫెస్టోతో ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. గత ఎన్నికల్లో చెప్పిన ఏ ఒక్కహామీని కూడా కేసీఆర్ సర్కారు నెరవేర్చలేకపోయిందని అరవింద్ మండిపడ్డారు. మూసి ప్రక్షాళణ చేయలేదని.. డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని ప్రజల్లోకి తీసుకువెళ్ళారు.
ఇక రాష్ట్రనేతలతో పాటు బీజేవైఎం జాతీయ అధ్యక్షులు తేజస్వీ సూర్య సైతం తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. ఉద్యమాల గడ్డ అయిన ఉస్మానియా యూనివర్సిటీ లో పర్యటించారు. సూర్యను అడ్డుకునేందుకు పోలీసులు వేసిన ముళ్లకంచెలు, బారికేడ్లను తొలగించుకుని మరీ క్యాంపస్ లోకి అడుగుపెట్టారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ప్రసంగించిన తేజస్వీ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఒక్కరి వల్లే తెలంగాణ రాలేదని విమర్శించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బీజేపీ నేతలందరూ కలిసికట్టుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com