గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో గులాబీ దళం జోరు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారం పతాక స్థాయికి చేరింది. శనివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ జరపనుంది. బల్దియా ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ పాల్గొంటున్న ఏకైక సభ కావడంతో.. గులాబీ నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. నేతలంతా జనసమీకరణలో నిమగ్నమయ్యారు.
భారీ బహిరంగ సభలో కేసీఆర్.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా ప్రజలకు, పార్టీ శ్రేణులకు సందేశం ఇవ్వడంతో పాటు ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం చెప్పనున్నారు. రాష్ట్ర, కేంద్ర రాజకీయాలపై ప్రసంగించనున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల్లోపు ఎల్బీ స్టేడియానికి చేరుకునేలా నేతలు జనసమీణకరణ చేస్తున్నారు. దాదాపు 3 వేల మంది కేసీఆర్ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా 2 లక్షల మాస్క్‌లు, శానిటైజర్లను పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు.
ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ఉండే గోషామహల్, ఖైరతాబాద్, అంబర్‌పేట, ముషీరాబాద్ సహా పలు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి నుంచి పాదయాత్రలుగా జనాన్ని తరలించనున్నారు. స్టేడియంలో మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై నుంచి కేసీఆర్ ప్రసంగిస్తారు. అదే వేదికపై మంత్రులు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూర్చుంటారు. కుడి వైపున కళాకారుల ప్రదర్శనల కోసం ఒక వేదిక, ఎడమ వైపున 150 డివిజన్ల నుంచి పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్ధుల కోసం మరో వేదిక రెడీ చేశారు. స్టేడియం లోపల, వెలుపల 12 భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. కేసీఆర్ ప్రసంగం అనంతరం సాయంత్రం 6 గంటలకు సభను ముగించేలా షెడ్యూల్ ఖరారు చేశారు గులాబీ నేతలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com