కేసీఆర్ వర్సెస్ అమిత్ షాగా మారిన గ్రేటర్ ఎన్నికలు

హైదరాబాద్ గడ్డపై పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ.. గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక తరహా విజయం సాధించాలని ఊవిళ్లూరుతోంది. అందుకే ఏకంగా జాతీయ నాయకులను రంగంలోకి దించింది. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న సీనియర్ నాయకులను కాషాయం జెండా కప్పుతోంది. చేరికలు కమలం పార్టీలో జోష్ పెంచుతున్నాయి.
నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో 21 మందికి అవకాశం ఇచ్చింది. ఇప్పటికే మెజార్టీ అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ.. మిగిలిన అభ్యర్థులను నేడు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలకు అధిష్ఠానం అప్పగించింది. 24 అసెంబ్లీ స్థానాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల్ని సమన్వయకర్తలుగా నియమించింది.
దుబ్బాక విజయంతో ఊపు మీదున్న కమలం పార్టీ గోల్కొండ కోటపై కూడా కాషాయం జెండా ఎగరేయాలని గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు ఈ ఎన్నికలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో ఈ ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ అమిత్ షాగా మారాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com