వరుస రోడ్ షోలతో దూసుకుపోతున్న కేటీఆర్

వరుస రోడ్ షోలతో మంత్రి కేటీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మంగళవారం అంబర్‌పేట్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఓ వైపు అభివృద్ధి మంత్రం జపిస్తూనే.. విపక్షాలకు కౌంటర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
ప్రతి ఒక్కరి ఖాతాలో 15లక్షల రూపాయల నగదు జమ చేస్తానని దేశప్రజల్ని ప్రధాని మోదీ మోసం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. గాంధీనగర్ డివిజన్ ప్రచారం పాల్గొన్న కేటీఆర్.. వరదలు, కరోనా కష్టకాలంలో ప్రజలతోనే ఉన్నామని తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో 15వందల రూపాయలు, బియ్యం పంపిణీ చేశామన్నారు. వరద సాయం కింద 10 వేల రూపాయలు అందచేశామన్న కేటీఆర్.. డిసెంబర్ 4 తర్వాత బాధితులు అందరికీ సాయం అందిస్తామని చెప్పారు.
అనంతరం రాంనగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, బాగ్‌లింగంపల్లిలో కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. ఆరేళ్లలో కేంద్రం తెలంగాణకు ఒక్క రూపాయి పని కూడా చేయలేదని ధ్వజమెత్తారు. లోకల్ లీడర్స్ వల్ల చేతకాక గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలు వస్తున్నారని.. గల్లీ పార్టీ కావాలో.. ఢిల్లీ పార్టీ కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు.
వరుస రోడ్ షోలతో ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రతిపక్షాల దూకుడుకు చెక్ పెడుతున్నారు కేటీఆర్. అలాగే హైదరాబాద్ అభివృద్ధికి టీఆర్ఎస్ ఏం చేస్తుందో వివరిస్తూనే ప్రతిపక్షాలపై మాటల దాడికి దిగుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com