గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ దూకుడు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కారు స్టీరింగ్‌ను తన చేతిలోనే పెట్టుకున్న మంత్రి కేటీఆర్.. ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని నడిపిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అభ్యర్థుల విజయానికి బాటలు వేస్తున్నారు. ఈ క్రమంలో వరుస రోడ్ షోలు నిర్వహిస్తూ పార్టీ స్టాండ్ ను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు.
ప్రచారంలో భాగంగా సోమవారం ఎల్బీ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఆర్కేపురం, మన్సూరాబాద్, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్ పీఅండ్‌టీ కాలనీ డివిజన్లలో రోడ్‌షోలు నిర్వహించిన కేటీఆర్.. ప్రతిపక్షాల తీరుపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ కు కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. బాధితులకు వరద సాయం పది వేలు ఆపినోళ్లు.. 25వేలు ఇస్తారా అని ప్రశ్నించారు.
దేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రం నుంచి వెళ్లే నిధుల్లో సగమే కేంద్రం తిరిగి ఇస్తోందని తెలిపారు.ఆరేళ్లలో కేంద్రం తెలంగాణకు నయాపైసా సాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ గులాబీలు కావాలా.. గుజరాత్ గులాములు కావాలో తేల్చేకోవాలంటూ వ్యాఖ్యానించారు.
రోడ్ షోలతో టీఆర్ఎస్ అభ్యర్థుల్లో జోష్ నింపుతూ కేటీఆర్ దూసుకుపోతున్నారు. అలాగే ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తూ గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com