గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీని ఓడించేందుకు బీజేపీ యాక్షన్ ప్లాన్?

తెలంగాణ ఏర్పడినప్పటినుంచి టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారింది. ప్రతి ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ ఘనవిజయం సాధించింది. కేసీఆర్ రాజనీతి, చతురత, హరీష్ గేమ్ ప్లాన్ తో టీఆర్‌ఎస్‌ను తెలంగాణలో తిరుగులేని శక్తిగా మార్చారు. అయితే ఇదంతా గతమంటున్నారు బీజేపీ నేతలు. దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమితో టీఆర్‌ఎస్ ఆశలు పటాపంచలయ్యాయంటున్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో కవితతో పాటు, సమీప బంధువు వినోద్‌ను ఓడించింది బీజేపీ. ఇప్పుడు దుబ్బాక బైఎలక్షన్‌లో గెలవడంతో బీజేపీలో నూతనుత్తేజయం కనిపిస్తోంది. దీంతో... ఇక టార్గెట్ తెలంగాణనేనంటున్నారు బీజేపీ నేతలు. టీఆర్ఎస్ పై మరింత దూకుడు పెంచి తామేంటో నిరూపించు కుంటామంటున్నారు. అందుకు తగ్గట్టే పక్కా ప్రణాళికతో గ్రేటర్ ఎన్నికల్లో దిగబోతున్నారు.
గ్రేటర్ ఎన్నికలకు రేపో మాపో షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించారు. ప్రతిసమావేశంలో.... గ్రేటర్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగర వేస్తామంటూ ఘంఠాపథంగా చెబుతున్నారు బండి సంజయ్. అంతేకాదు.. ఈ మేరకు యాక్షన్ ప్లాన్ సైతం అమలు చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రభావితం చేసే నేతలతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. టీఆర్ఎస్ కంటే ముందే... తమ ప్లాన్ అమలు చేస్తున్నారు బీజేపీనేతలు. ఇది గ్రహించిన టీఆర్‌ఎస్... బీజేపీకి కౌంటర్‌గా.. గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు కురిపించింది.
టీఆర్ఎస్ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు పసిగడుతోన్న బీజేపీ జాతీయనాయకత్వం చాలా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ను మార్చిన బీజేపీ.... తాజాగా జాతీయ నేతల ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీని వేసింది. బీహార్ ఎన్నికల్లో విజయానికి కారణమైన భూపేంద్ర యాదవ్ కు గ్రేటర్ బాధ్యతలు అప్పజెప్పింది. ఉపాధ్యక్షుడిగా అఖిలేష్ షెల్లర్, సభ్యులుగా గుజరాత్ కు చెందిన ప్రదీప్ సింగ్, కర్ణాటకకు చెందిన సతీష్ రెడ్డిలకు గ్రేటర్ ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పింది. గ్రేటర్ అధికంగా ఉన్న యాదవ సామాజిక వర్గ ఓట్లను రాబట్టేందుకే భూపేంద్ర యాదవ్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
భూపేంధ్ర యాదవ్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యనేతలను గ్రేటర్ లో దిపింది బీజేపీ జాతీయ నాయకత్వం. వీరంతా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చెందిన నేతలే కావడం విశేషం. అటు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం మరో కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చైర్మన్ గా జాతీయ ఓబీజీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ కన్వీనర్ గా 23 మందితో కమిటీ ఏర్పాటైంది. వీరంతా గ్రేటర్ లో బీజేపీ గెలుపు అవకాశాలను పెంపదించనున్నారు. ఇక కో కన్వీనర్ లు గా మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, మాజీ ఎంపీ గరిక పాటి రామ్మోహన్ రావు, మాజీ ఎంపీ జిత్తేందర్ రెడ్డిలను నియమించారు. వీరితో పాటు దుబ్బాక ఉప ఎన్నికల తరహాలోనే.... మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కమిటీలో సభ్యులు. వీరి సారథ్యంలో గ్రేటర్ లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది బీజేపీ.
టీఆర్ఎస్ గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న అంశాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లనుంది బీజేపీ. కేంద్రం పట్టణాలకు ఇస్తున్న సాయంను కూడా ప్రజలకు చేరవేయనుంది బీజేపీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం... కేంద్రం ఇచ్చిన నిధుల నుంచేనన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు బీజేపీ జాతీయ నాయకత్వం ఓ కమిటీ వేయడం, అందులో యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలు అధ్యక్షడిగా నియమించడం... ఓ వ్యూహం ప్రకారమే చేస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి దుబ్బాక ఉప ఎన్నికల తరువాత దూకుడు పెంచిన బీజేపీ..గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com