రసవత్తరంగా GHMC మేయర్ : పదవి దక్కించుకునేందుకు లీడర్ల తీవ్ర ప్రయత్నాలు

గ్రేటర్ హైదరాబాద్ నూతన పాలక మండలి ఏర్పాటు కు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు బల్దియా లో నూతనంగా ఎంపికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నిక ఉండనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరిగి రెండు నెలలైనా ... మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరనేది టిఆర్ఎస్ అధిష్టానం సీక్రెట్ గా ఉంచింది.
రేపు సీల్డ్ కవర్ లో గ్రేటర్ పీఠంపై ఎవరు కూర్చుంటారనేది తేలనుంది. ఉదయం ఎనిమిది గంటలకల్లా కార్పొరేటర్ లతోపాటు గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎక్స్అఫీషియో మెంబర్స్ తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. 9 గంటలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీల్డ్ కవర్ ను ఓపెన్ చేసి మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ప్రకటిస్తారు. అందరూ కలిసి ప్రత్యేక బస్సుల్లో జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయానికి వెళ్లి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొంటారు.
మేయర్ పదవిని తమ వారసులకు ఇప్పించుకునేందుకు టీఆర్ఎస్ లీడర్లు చివరి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రగతిభవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్, కేటీఆర్ లను కలిసి తమ వాళ్లకు చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే వారు ఇప్పటివరకు అందరూ చెప్పింది వినడమే తప్ప.. ఎవరికీ ఎట్లాంటి సంకేతాలు ఇవ్వడం లేదని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఎంపీ కె.కేశవరావు తన బిడ్డ విజయలక్ష్మికి మేయర్ పదవి ఇప్పించేందుకు తీవ్రంగా ట్రై చేస్తున్నట్టు పార్టీ లీడర్లు చెప్తున్నారు. ఇక ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ తన భార్య శ్రీదేవికి మేయర్ పదవి ఇవ్వాలని అడుగుతున్నట్టు తెలిసింది.
రెండు రోజుల క్రితం రామ్మోహన్, శ్రీదేవి ఇద్దరూ ప్రగతిభవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ ను కలిశారు. మరోవైపు తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలతకు మేయర్ పదవి ఇవ్వాలంటూ ఆమె భర్త శోభన్ రెడ్డి గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇక ఇప్పటికే పలుసార్లు కేటీఆర్ ను కలిసి తనకు మేయర్ చాన్స్ ఇవ్వాలని కోరారు పీజేఆర్ బిడ్డ విజయారెడ్డి. భారతీనగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శ్రెడ్డికి మేయర్ పదవి ఇవ్వాలని ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కోరుతున్నట్టు సమాచారం. వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్ మన్నె కవిత, అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి కూడా మేయర్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com