GHMC : జీహెచ్ఎంసీని నాలుగు కార్పొరేషన్లుగా విభజిస్తాం : మంత్రి కోమటిరెడ్డి

ఎవరెన్ని విమర్శలు చేసినా మూసీ నది ప్రక్షాళన జరిగి తీరుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ మూసీ డెవలప్ మెంట్ ఫండ్ కింద రూ. వెయ్యి కోట్లు లోన్లు తీసుకున్నారని, ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. శుక్రవారం హైదరాబాద్ నోవాటెల్‌లో నిర్వహించిన అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. మూసీ దుర్వాసనతో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని, క్యాన్సర్ వంటి మహహ్మారి రోగాల బారిన ప్రజలు పడుతున్నారన్నారు. మూసీ నిర్వాసిత ప్రజలు ప్రభుత్వానికి సహకరించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ వంటి నగరం జనాభా రోజు రోజుకు పెరిగిపోతున్నదని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా జీహెచ్ఎంసీని నాలుగు కార్పొరేషన్లు విభజించబోతున్నామని ప్రకటించారు. రాజకీయంగా విమర్శించే వాళ్లు విమర్శిస్తూనే ఉంటారని కానీ ప్రజల ఆరోగ్యం కోసం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులు ఆందోళన చేస్తున్నా వారిని పట్టించుకోకుండా కేసీఆర్ కాళేశ్వరం నిర్మిస్తే అది కాస్తా కూలిపోయి రూ.2 లక్షల కోట్లు నీటిపాలైందన్నారు. మూసీ సుందరీకరణ కోసం రూ.1.50 కోట్లా అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. కానీ డీపీఆర్ సిద్ధం చేయకముందే కేటీఆర్ ఆ ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కావాలనే ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే విమర్శలు చేస్తున్నారని కానీ ఎట్టి పరిస్థితుల్లో మూసీ ప్రక్షాళన చేస్తామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com