TG : రైతులకు గుడ్ న్యూస్.. రేపే రూ.లక్ష రుణమాఫీ

భూమి పాస్ బుక్ ఆధారంగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కేవలం కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన అని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 18 సాయంత్రంలోగా రూ.లక్ష రుణమాఫీ చేస్తున్నట్లు ఆయన రైతులకు తీపి కబురు చెప్పారు. అదే రోజు రైతుల ఖాతాల్లో రుణ మాఫీ నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం రాష్ట్రంలో రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డ్ నిబంధనపై కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం స్పష్టత ఇచ్చారు.
విపక్షాల విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు. సోమవారం విడుదల చేసిన మార్గదర్శకాలలో ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించారు. 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 13 వరకు లోన్లు తీసుకున్న వారంతా అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రేషన్ కార్డు నిబంధన రైతులు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. విపక్షాలు ఈ అంశంపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించాయి.
సచివాలయంలో కలెక్టర్ల సమీక్షా సమావేశంలో రుణమాఫీ మార్గదర్శకాలపై సీఎం పూర్తి వివరాలను వివరించారు. గురువారం సాయంత్రంలోపు రైతుల ఖాతాల్లో రూ.లక్ష రుణమాఫీ నిధులు జమ కానున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఈనెల 18న రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబురాలు ఉంటాయన్నారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్ల పైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com