NTPC :తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. NTPCకి పర్యావరణ అనుమతులు మంజూరు

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) నిర్మించ తలపెట్టిన విద్యుత్ ప్రాజెక్టు రెండో దశ పనులకు కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు విద్యుత్ అవసరాలను తీర్చడానికి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు, రాష్ట్ర విద్యుత్ రంగానికి మరింత బలం చేకూర్చనుంది.
మొత్తం 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మిస్తున్నారు. మొదటి దశలో ఇప్పటికే 1,600 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రం నిర్మాణం పూర్తైంది. ఇప్పుడు, రెండవ దశలో 2,400 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త ప్లాంట్ల నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా 800 మెగావాట్ల సామర్థ్యం గల మూడు విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను నిర్మించనున్నారు.
కాగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ, నీరు, బొగ్గు సరఫరాల కోసం ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. పర్యావరణ అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం జనవరి 28న కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా, తాజాగా వాటికి ఆమోదం లభించింది. 2030 నాటికి ఈ కొత్త యూనిట్ల నిర్మాణం పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com