TG : కుట్రతోనే దాడి.. వెనకున్నవారిని వదిలేది లేదన్న ప్రభుత్వం

లగచర్లలో కలెక్టర్, తదితర అధికారులపై దాడి కేవలం ఉద్రిక్త వాతావరణంలో అనుకోకుండా జరిగింది కాదని, ఈ మొత్తం వ్యవహారం వెనుక పెద్ద కుట్ర కోణం ఉందని పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతోంది. ఇదే విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబుతో సహా పలువురు నేతలు చెబుతుండగా, ముందస్తుగా ప్రణాళిక రచించి తదనుగుణంగా దాడి చేసినట్టు ప్రధాన నిందితుని ఫోన్ కాల్స్ ద్వారా స్పష్టమవుతోందని అధికారవర్గాలు ఆరోపిస్తున్నాయి. పచ్చని పొలాలను పొట్టనబెట్టుకోవడాన్ని సహించలేకే రైతులు ఆగ్రహంతో దాడి చేశారని బీఆర్ఎస్ చెబుతోంది. దాడులు జరిగాయన్న నెపంతో అమాయక రైతుల్ని అరెస్ట్ చేసి అసలుకే మోసం తెచ్చుకోవద్దని భాజపా నేతలు రేవంత్ సర్కార్ ను హెచ్చరిస్తున్నారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ను నమ్మించి ఊళ్లోకి తీసుకువెళ్లారని, దాడి ఘటనపై సీరియస్ అయ్యారు జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఐజీ, ఎస్పీ ఇతర అధికారులతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఘటనపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిఘా వైపల్యంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. నిఘా విభాగం ఏం చేస్తోందంటూ అధికారులను మంత్రి నిలదీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com