Hyderabad : రోశయ్య కాంస్య విగ్రహానికి ప్రభుత్వం నిర్ణయం

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దివంగత కొణిజేటి రోశయ్య స్మారకార్థం ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నిర్ణయించింది. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ నగరంలోని లక్డీకపూల్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న కూడలిలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠాపించనున్నారు. తొమ్మిది అడుగుల ఎత్తు ఉండే ఈ కాంస్య విగ్రహం ఏర్పాటుకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే టెండర్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. అర్హులైన కాంట్రాక్టర్ల నుంచి బిడ్‌లను ఆహ్వానిస్తున్నారు.
జూలై 4వ తేదీన కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ఈ దిశగా ఏర్పాట్లు ముమ్మరం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. కొణిజేటి రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలం పాటు ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత తమిళనాడు గవర్నర్‌గా కూడా విశేష సేవలు అందించారు. ఆయన రాజకీయ అనుభవం, పరిపాలనా దక్షత తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com