Telangana Formation Day : ఆవిర్భావ వేడుకలపై ప్రభుత్వ అధికారులకు సర్కారు ఆదేశాలు

Telangana Formation Day : ఆవిర్భావ వేడుకలపై ప్రభుత్వ అధికారులకు సర్కారు ఆదేశాలు
X

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల సంబరాలు అంబరాన్నంటేలా జరుపుదామని డిప్యూటీ సీఎం భట్టి పిలుపునిచ్చారు. ఈ వేడుకలకు అధికారులు, అన్ని శాఖలు సమన్వయం తో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కోఆర్డినేషన్ సమావేశంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రంగా జిల్లాలో జూన్ 2న జరుగుతున్న ఏర్పాట్లను ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సమీక్షించారు. జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించడం, ఆ తరువాత పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న జెండా వందనం, మార్చ్ ఫాస్ట్, ప్రసంగం, అధికారులకు మెడల్స్ పంపిణీ తదితర కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ప్రధానంగా హైదరాబాద్, ఆ తర్వాత జిల్లా కేంద్రాల్లో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో ఇంచార్జి మంత్రులు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ ను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వాణపై సమీక్షించారు. ఈసారి అవతరణ ఉత్సవాలకు రాష్ట్ర అతిథులుగా జపాన్ మేయర్, మిస్ వరల్డ్ విజేతలు హాజరై వేడుకలను తిలకించనున్నారని పేర్కొన్నారు.

ఆయా కార్యక్రమాలు, వేడుకలపై సందర్భంగా చేయాల్సిన ప్రత్యేక ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కోడ్ మూలంగా గత సంవత్సరం అనుకున్న మేరకు పెద్ద ఎత్తున అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించలేకపోయామన్నారు. ఈసారి విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర కీర్తిని ప్రతిబింబించేలా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తుంటారని, ఎక్కడైనా ఏ అధికారికైనా ఎలాంటి ఇబ్బంది లేదా ఉత్సవాలు గొప్పగా నిర్వహించేందుకు మంచి ఆలోచనలు ఏవైనా ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని సూచించారు. ఎలాంటి సంశయానికి గురికావలసిన అవసరం లేదని డిప్యూటీ సీఎం తెలిపారు. సమావేశం లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ సీఎస్లు వికాస్ రాజ్, రఘునందన్ రావు, సమాచార శాఖ కమిషనర్ హరీష్, పోలీస్ అధికారులు సివి ఆనంద్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story