Manja: ప్రాణాలు తీస్తున్న మాంజాలు.. నిషేధం మాట గాలికే..

Manja: ఇంకెన్ని ప్రాణాలు పోవాలి.. మాంజాపై నిషేధం ఏమైంది.. దారాలు ఆపడంలో వైఫల్యం ఎక్కడుంది? పీకలు కోస్తున్నా సీరియస్‌గా తీసుకోరా? మాంజా అమ్మినా, కొన్నా నేరమే. నిబంధనలు అతిక్రమిస్తే లక్ష రూపాయల వరకు జరిమానా. ఐదేళ్ల వరకు జైలు శిక్ష. లేదంటే రెండు శిక్షలు అమలు చేయొచ్చు. ఇదీ 2016లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు. ఈ తీర్పును కఠినంగా అమలు చేసి ఉంటే.. ఇవాళ నిండు ప్రాణాలు బలయ్యేవి కావు. కుటుంబాలు నడిరోడ్డున పడేవి కావు.
పాత మంచిర్యాలలో భీమయ్య అతని భార్య బండిపై వస్తుండగా చైనా మాంజా దారం భీమయ్య మెడకు చుట్టుకుంది. నియంత్రణ కోల్పోయి ఇద్దరూ బండి నుంచి పడిపోయారు. వెనుక కూర్చున్న భీమయ్య భార్యకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తేరుకుని చూసే లోపే.. భార్య కళ్ల ముందే భీమయ్య గొంతు తెగి రక్తం ధారలుగా ఉబికివస్తోంది. చీరతో రక్తస్రావం ఆపడానికి ప్రయత్నించినా.. అప్పటికే చేయి దాటి పోయింది. భీమయ్య పీక తెగిపోవడంతో భార్య ఒడిలోనే, భార్యను చూస్తూనే కన్నుమూశాడు. పండగ పూట, అందరి కళ్ల ముందూ జరిగిన ఈ విషాదం.. ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించింది.
కామారెడ్డి జిల్లా బాన్సువాడలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. మాంజా చుట్టుకోవడంతో అజాజ్ అనే వ్యక్తి గొంతు తెగింది. తెగిన గాయాన్ని అలాగే అదిమిపెట్టి.. రోడ్డుపై వెళ్తున్న వారి సహాయం అడిగారు. పక్కనున్న వాళ్లు కూడా వెంటనే స్పందించి హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అజాజ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్నారు వైద్యులు.
మెరుగైన చికిత్స కోసం అజాజ్‌ను నిజామాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు.మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో శనివారం నాడు 20 ఏళ్ల యువతి చైనా మాంజా కారణంగానే ప్రాణాలు కోల్పోయింది. స్నేహితుడితో కలిసి స్కూటర్‌పై వెళుతుండగా ఈ ఘటన జరిగింది. గాలిపటం దారం గొంతును కోసేయడంతో తీవ్ర రక్తస్రామై యువతి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది.
గత డిసెంబర్ 19వ తేదీన హైదరాబాద్ పురానాపూల్‌లో జుబైర్ అనే వ్యక్తి బండి మీద వెళ్తుండగా.. చైనా మాంజా తగిలి పీక తెగింది. గత మూడు వారాల్లో ఇలాంటి సంఘటనలు నాలుగు జరిగాయి. ఈ నెల జనవరి 4వ తేదీ కూడా అంబర్‌పేటలోని పటేల్ నగర్‌లో చైనా మాంజా తగలడంతో పావురం చనిపోయింది. ఇప్పుడు ఏకంగా మనిషి ప్రాణమే పోయింది.
పతంగుల పోటీలు జరుగుతుండడంతో.. ప్రత్యర్థి గాలి పటాన్ని తెంపేందుకు ప్రత్యేక దారాలు తయారుచేస్తున్నారు. గాజు ముక్కలు దంచి, మైదాలో కలిపి దారానికి పూస్తున్నారు. ఇది గానీ పీకకు తగిలిందంటే.. కొన్ని సందర్భాల్లో స్పాట్‌లో ప్రాణం పోవడం ఖాయం. చేతులు, కాళ్లు, శరీర భాగాలు సైతం తెగిపడతాయి. చైనా మాంజాపై నిషేధం విధించి ఆరేళ్లు అవుతున్నా.. ఇంకా వీటి అమ్మకాలు యథేచ్చగా సాగుతుండడం అధికారుల వైఫల్యం కాదా అని ప్రశ్నిస్తున్నారు.
సింథటిక్ మాంజా అమ్మకాలు, కొనుగోళ్లను తనిఖీ చేయడానికి అటవీశాఖ మొబైల్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలి. నిషేధ ఉత్తర్వులను అమలు చేసేందుకు జిల్లా అటవీ అధికారులు జిల్లాల్లో మొబైల్ పార్టీలను ఏర్పాటు చేయాలి. సింథటిక్ లేదా నైలాన్ మాంజాను విక్రయించవద్దని, కొనుగోలు చేయవద్దంటూ అటవీ శాఖ వాళ్లే పోస్టర్లు వేయాలి.
స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్ల సహాయంతో అవగాహన కల్పించాలి. ఎక్కడైనా, ఎవరైనా మాంజా అమ్మినా, కొన్నా ఫిర్యాదు చేయడానికి టోల్‌ఫ్రీ నెంబర్లు అందరికీ తెలిసేలా పెట్టాలి. కాని, రాష్ట్రంలో ఇలాంటివి కనిపించిన దాఖలాలే లేవంటున్నారు పర్యావరణ ప్రేమికులు. అయితే, గత కొన్ని వారాలుగా షాపులపై దాడులు చేస్తున్నప్పటికీ.. పెద్ద మార్కెట్ కారణంగా వీటి అమ్మకాలను పూర్తిస్థాయిలో నిషేధించడం సాధ్యం కావడం లేదని పోలీసులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com